డబ్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ డ్రా అయితే గద ఎవరికి..? 

డబ్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ డ్రా అయితే గద ఎవరికి..? 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం(జూన్ 7) మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా డ్రాగా ముగిస్తే విజేత ఎవరన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. 'ఒకపక్క ఎండలు మండిపోతుంటే వర్షం ఏంట్రా..' అని తిట్టుకోకండి. ఏమో.. మండు వేసవిలో ఐపీఎల్-16 ఫైనల్‌ జరిగిన అహ్మదాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తుతుందని ఎవరైనా ఊహించామా? అసలే ఇంగ్లాండ్‌. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.

వాతావరణ నివేదికల ప్రకారం.. మొదటి రెండు రోజులు ఎలాంటి వర్షం ఆటంకం లేనప్పటికీ.. మూడవ, నాల్గవ రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఐసీసీ..జూన్ 12ను రిజర్వ్ డే కేటాయించింది. మొదటి ఐదు రోజులలో ఎప్పుడైనా వర్షం పడి ఆటకు అంతరాయం కలిగితే.. ఆ కోల్పోయిన సమయాన్ని మిగిలిన రోజులలో కవర్ చేస్తారు. అప్పుడు కూడా వీలుకాకపోతే.. రిజర్వ్ డే ఆడిస్తారు. అప్పటికీ ఫలితం రాకపోతే మ్యాచును డ్రాగా ప్రకటిస్తారు. ఒకవేళ ఆలోపే ఫలితం వచ్చినా, మ్యాచ్ టై అయినా రిజర్వ్ డేని పరిగణలోకి తీసుకోరు. 

ఇరు జట్లు ఉమ్మడి విజేతలుగా..

ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తుంది. అలాగే మ్యాచ్ టై అయినా.. ఇరు జట్లు సంయుక్తంగా చాంపియన్లుగా మారతాయి.