గురుకులాల్లో కరోనా టెన్షన్!

గురుకులాల్లో కరోనా టెన్షన్!

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల స్కూళ్లలో స్టూడెంట్స్ ను కరోనా టెన్షన్ పెడుతోంది. ఇటీవల వరుసగా పలు జిల్లాల్లోని గురుకులాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల బాలికల స్కూల్​లో ఆదివారం 29 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. శనివారం 12 మంది స్టూడెంట్స్ కు కరోనా సోకగా, ఆదివారం చేసిన పరీక్షల్లో మరో 17 మందికి కూడా సోకినట్టు తేలింది. దీంతో ఆ స్టూడెంట్స్ ను చికిత్స కోసం పేరెంట్స్ ఇళ్లకు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఇతర స్టూడెంట్ల పేరెంట్స్ కూడా టెన్షన్ తో వారి పిల్లలను కూడా ఇళ్లకు తీసుకొని వెళ్లారు. స్కూల్ లో మొత్తం 650 మంది స్టూడెంట్స్ ఉండగా, కొంతమందికి ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలగా, అనుమానం ఉన్న మరికొందరికి నెగిటివ్ వచ్చినా కన్ఫర్మేషన్ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టులకు శాంపిల్ తీసుకొని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. వాళ్ల టెస్ట్ రిజల్ట్ సోమవారం వచ్చే అవకాశముంది. 

ఇండ్లకు వెళ్లి వచ్చిన వారివల్లే..

వివిధ పండుగలు, పబ్బాలకు ఇండ్లకు వెళ్లి తిరిగి వస్తున్న స్టూడెంట్స్​ద్వారానే కేసులు వస్తున్నాయని ఆఫీసర్లు గుర్తించారు. దీంతో అత్యవసరమైతే తప్ప, స్టూడెంట్స్ ను గురుకులాల నుంచి బయటకు పంపించవద్దని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బయటకు వెళ్లినవారు తిరిగి స్కూల్ కు వచ్చేటప్పుడు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయో లేదో పరిశీలించాకే తీసుకుంటున్నారు. వైరాలో శనివారం మొదట బయటపడిన కరోనా కేసులకు కూడా ఒక స్టూడెంట్​ఇంటికి వెళ్లి కొద్ది రోజుల తర్వాత తిరిగి రావడమే కారణమని తెలుస్తోంది. ఇటీవల 8వ తరగతి స్టూడెంట్​ను ఓణీల ఫంక్షన్ కోసం పేరెంట్స్ తీసుకెళ్లారు. ఆ తర్వాత జలుబుతో వచ్చిన బాలిక ద్వారా అదే క్లాస్ కు చెందిన ఇతర స్టూడెంట్స్​కు కరోనా వ్యాప్తి చెందింది. అందరికీ జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో శనివారం చేయించిన ర్యాపిడ్ టెస్టుల్లో ఆ క్లాస్ లో 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఆదివారం మరో 17 మందికి బయటపడింది. అయితే అందరికీ సాధారణమైన జలుబు, జ్వరం తప్పించి ఎవరికీ సీరియస్ కాకపోవడంతో ఆఫీసర్లు, పేరెంట్స్ కొంత ఊపిరి పీల్చుకున్నారు.  

స్కూల్​లోనే ట్రీట్​మెంట్​

కరోనా వచ్చిన స్టూడెంట్స్​ను స్కూళ్లలోనే ఐసోలేషన్​లో ఉంచుతున్నారు. ప్రత్యేక గదుల్లో ఉంచి కావాల్సిన ఫుడ్, మెడిసిన్​అందిస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవల నల్గొండ జిల్లా దామరచర్ల, కొండమల్లేపల్లి మండలాల్లోని ఎస్టీ బాలికల గురుకుల స్కూల్​లో పలువురు స్టూడెంట్స్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గురుకులాలు, స్కూళ్లలో స్టూడెంట్లు, టీచర్లు, సిబ్బందికి కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్ వచ్చిన స్టూడెంట్లకు స్కూల్స్​లోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రీట్​మెంట్ ఇచ్చారు. గురుకులాలు, హాస్టల్స్​లో ఉంటున్న స్టూడెంట్స్​సెలవులకు, పండుగలకు ఇళ్లకు పోయివచ్చినప్పుడు కరోనా సోకుతోందని ప్రిన్సిపల్స్​ చెబుతున్నారు. దీంతో పేరెంట్స్ వచ్చి అడిగినా అత్యవసరమైతే తప్ప ఇళ్లకు పంపడం లేదు.

కాగా, ఇటీవల కురుస్తున్న వానలకు సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తుండటంతో ఏది కరోనా, ఏది సీజనల్ వ్యాధో అర్థంకాక భయపడుతున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకుల స్కూల్​లో స్టూడెంట్లు జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో ఈ నెల 16, 17 తేదీల్లో 630 మందికి టెస్టులు చేశారు. ఇందులో 8వ తరగతికి చెందిన ఆరుగురు, 9వ తరగతి కి చెందిన ఏడుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న 20 మంది స్టూడెంట్స్ ని ఇండ్లకు పంపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం కేజీబీవీలో ఇటీవల జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. ముగ్గురు స్టూడెంట్స్ కు పాజిటివ్ గా రిజల్ట్ రావడంతో వారికి ఆఫీసర్లు దగ్గరుండి ట్రీట్ మెంట్ చేయించారు. పిల్లలకు వైరస్​ సోకినా గురుకులాల్లోనే ఐసోలేషన్​ చేసి, మంచి ఫుడ్, మెడిసిన్​ ఇస్తున్నందున పేరెంట్స్​ ఎవరూ ఆందోళన చెందవద్దని, అత్యవసరమైతే తప్ప ఇండ్లకు తీసుకెళ్లవద్దని ఆఫీసర్లు సూచిస్తున్నారు.