ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటిన యాస్ తుపాన్.. దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతోంది. తీరం దాటడానికి ముందే ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. తుపాన్ తీరం దాటే సమయానికి చంద్రగ్రహణం, పౌర్ణమి కూడా తోడవుతుండడంతో సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షం కూడా కుండపోతలా కురుస్తుండడంతో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.
తీరం దాటానికి ముందే బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టించిన యాస్ తుపాన్ కు ఇప్పుడు పున్నమి కూడా తోడయింది. ఇవాళ పౌర్ణమికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా తోడవుతుండడంతో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లోని ఐదు జిల్లాల్లో, ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునుగుతున్నట్లు సమాచారం అందుతోంది. సాధారణంగా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూర్ మూన్ గా కనిపిస్తుంది. ఈ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా ఉంటాయి. యాస్ తుపాన్ సమయంలో పున్నమి, చంద్రగ్రహణాలు కూడా ముంచుకురావడంతో తీరప్రాంతం అంతా అల్లకల్లోలం గా మారింది.
ముఖ్యంగా ఒడిశాలోని భద్రక్ జిల్లాలో 30 గ్రామాలను సముద్రం నీరు ముంచెత్తి బీభత్సం సృష్టించింది. వందలాది ఇళ్ల పై కప్పులు ఈదురు గాలుల దెబ్బకు ఎగిరిపడ్డాయి. విద్యుత్ స్తంభాలే కాదు పెద్ద పెద్ద వట వృక్షాలు కూడా నేలకొరిగి వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం కనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే ఒడిశాలోనే ఉన్న బాలేశ్వర్ జిల్లా చాందీపూర్ తీరంలో సముద్రం బాగా ముందుకు చొచ్చుకు వచ్చిందని ఉదయమే స్థానికులు తీర ప్రాంతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
బెంగాల్ రాజధాని కోల్ కతాలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. యాస్ తుపాను ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వాతావరణశాఖ ముందే హెచ్చరించిన నేపధ్యంలో తీర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
