- యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తిచేసుకుని గృహప్రవేశాలు జరుపుకోవాలని లబ్ధిదారులకు యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి, రాళ్లజనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుందని అడిగి తెలుసుకున్నారు. తాపీ మేస్త్రిని ఎంత రేటుకు మాట్లాడుకున్నారని, ఇటుక, సిమెంట్ అవసరమైన మెటీరియల్ ను షాపులో ఎంత రేటు కు కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ ధరకు మెటీరియల్ సప్లయ్ చేయడానికి షాపుల యజమానులకు ఒక ధర నిర్ణయించామన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసుకుంటే బిల్లు పడుతుందని తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన కంప్లీట్ చేసుకుని గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని సూచించారు.
