- లిస్ట్ పంపించిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్
- తహసీల్దార్లతో కలెక్టర్ స్పెషల్ మీటింగ్
- 2020 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పరిశీలన
- 2021 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి 5 వరకు రూ. 4.96 కోట్ల ఫ్రాడ్ జరిగినట్లు గుర్తింపు
- పోలీసుల అదుపులో మరో నలుగురు నిర్వాహకులు, పరారీలో ఇద్దరు
యాదాద్రి, వెలుగు : డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌లో యాదాద్రి జిల్లాలో జరిగిన అవినీతి లెక్కలు బయటపడుతున్నాయి. జనగామ జిల్లాలో ఈ అవినీతి వెలుగుచూడడంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ).. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను బయటకు తీసింది.
దీంతో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా గత ఐదేండ్లలో మొత్తం 1,367 డాక్యుమెంట్లలో ఫ్రాడ్ జరిగినట్లు తేలడంతో ఆ లిస్ట్ జిల్లా ఆఫీసర్లకు పంపించింది. యాదాద్రిలో 2021 ఫిబ్రవరి నుంచి మొదలైన ఈ అవినీతి దందా ఈ ఏడాది జనవరి 5 వరకు కొనసాగినట్లు ఎన్‌ఐసీ గుర్తించింది. స్లాట్ బుకింగ్‌లో అవినీతి వ్యవహారం వెలుగు చూడడంతో కొందరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు పరార్ కాగా.. మరికొందరిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తహసీల్దార్లతో అత్యవసర మీటింగ్
స్లాట్ బుకింగ్‌లో అవకతవకల వ్యవహారానికి యాదాద్రి జిల్లాలోని వ్యక్తులే ప్రధాన కారణమని తేలడంతో స్పందించిన ఉన్నతాధికారులు తహసీల్దార్లతో ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. ఎన్‌ఐసీ నుంచి లిస్ట్ వచ్చిన వెంటనే పూర్తి వివరాలతో కలెక్టరేట్‌కు రావాలని జిల్లాలోని 17 మండలాల తహసీల్దార్లకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టరేట్‌లో స్పెషల్ మీటింగ్ కొనసాగింది. విచారణాధికారులుగా నియమించిన ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి డాక్యుమెంట్ల వారీగా వివరాలను సేకరించారు.
యాదాద్రిలో రూ. 4.96 కోట్ల అవినీతి
ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ రేటు ప్రకారం యాదాద్రి జిల్లాలో ఎకరం రూ. 2.50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉంది. ఈ ప్రకారమే భూములకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ లెక్కన అవినీతి జరిగినట్లు భావిస్తున్న 1,367 రిజిస్ట్రేషన్లకు మొత్తం రూ. 5,49,81,004 ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సి ఉంది. కానీ రూ. 57,34,123 మాత్రమే జమ అయింది. ఈ లెక్కన ఒక్క యాదాద్రి జిల్లాలోనే రూ. 4.96 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆఫీసర్లు నిర్ధారణకు వచ్చారు.
రాజాపేటలోనే ఎక్కువ
యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలంలోనే ఎక్కువ అవినీతి జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 1,367 డాక్యుమెంట్లలో అవినీతి జరిగినట్లు తేలగా.. ఇందులో 372 డాక్యుమెంట్లు ఒక్క రాజాపేట మండలానికే చెందినవి కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. అడ్డగూడూరు మండలంలో తక్కువగా మూడు డాక్యుమెంట్లలో ఫ్రాడ్ జరిగినట్లు తేలింది. పూర్తిస్థాయి విచారణ జరిగితేనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
వరంగల్ పోలీసుల అదుపులో మరో నలుగురు
జిల్లాలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు, గుండాల మండలాలకు చెందిన మరో నలుగురు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి లెక్కలు బయటపడుతుండడంతో చౌటుప్పల్‌కు చెందిన ఇద్దరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు తమ ఫోన్లను స్విచాఫ్ చేసుకొని మాయమయ్యారు. దీంతో వీరి బంధువులను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదే విధంగా వివిధ మండలాలకు చెందిన పలువురు మీ సేవ నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులను పోలీసులు పిలిపించుకొని ఆరా తీస్తున్నారు.
తహసీల్దార్ల నిర్లక్ష్యమూ కారణమే..
స్లాట్ బుకింగ్ అవినీతి వ్యవహారంలో తహసీల్దార్ల నిర్లక్ష్యమూ కారణమేనని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. పేమెంట్ స్టేటస్‌లో చెల్లించాల్సి మొత్తం, చెల్లించిన మొత్తం కన్పించే అవకాశం ఉండగా, రిజిస్ట్రేషన్ టైంలో డాక్యుమెంట్ రెండు లేదా మూడో పేజీలోని ‘ఎండార్స్‌మెంట్’ను పరిశీలిస్తే ఎంత మొత్తంలో చెల్లించారో తెలిసిపోతుంది. అయితే ఈ విషయాన్ని తహసీల్దార్లు పట్టించుకోకపోవడం వల్లే అవినీతి జరిగినట్లు చెబుతున్నారు. మరో వైపు భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ పైస్థాయిలో పర్యవేక్షణ కొరవడడం వల్లే ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. రిజిస్ట్రేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆడిట్ చేస్తే ఖజానాలో జమ చేయాల్సిన మొత్తం ఎంత ? ఎంత జమ అయిందో తేలేదని, అప్పుడే ఈ చీటింగ్ వ్యవహారం బయటపడేదని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడెందుకు ఎర్రర్ రావడం లేదు ?
ధరణి పోర్టల్ వచ్చిన ఏడాదికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని సవరించింది. స్టాంప్ డ్యూటీ సవరించడానికి ముందే స్లాట్ బుక్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అప్పట్లో పేమెంట్ స్టేటస్ వద్దకు రాగానే ‘ఎర్రర్’ చూపించేది. దీంతో పెరిగిన మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది.
ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ కంటే తక్కువ పేమెంట్ చేసినా స్లాట్ బుక్ కావడంతో పాటు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అయితే గతంలో ‘ఎర్రర్’ అని చూపిన పోర్టల్ ఇప్పుడు ఎందుకు చూపించలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చీటింగ్ వ్యవహారంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులే కాకుండా పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.
