యాదాద్రిలో ప్రసాదం కౌంటర్​ ప్రారంభం

యాదాద్రిలో ప్రసాదం కౌంటర్​ ప్రారంభం
  • మొదటిరోజే రూ. 8 లక్షల ఆదాయం
  • నిత్య కైంకర్యాలు, పూజలతో  మరో రూ.10 లక్షలు 

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన రూ.15 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రసాద కౌంటర్​ను మంగళవారం ఏఈవో శ్రావణ్ కుమార్‌ ప్రారంభించారు. గుట్టపైన పనుల‌ కారణంగా ఆరేండ్ల కింద ప్రసాదాల తయారీని పాతగుట్టకు మార్చారు. కొండపైన కౌంటర్​ పనులు పూర్తి కావడంతో మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు.

భారీగా ఆదాయం

సోమవారమే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం కావడం, ప్రస్తుతానికి వీఐపీ దర్శనాలకు ప్రత్యేక మార్గం లేకపోవడంతో.. ప్రతిఒక్కరూ ధర్మదర్శన క్యూలైన్ల నుంచే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. క్యూ కాంప్లెక్స్ కు ఆనుకునే ప్రసాదం కౌంటర్​ ఏర్పాటు చేయడంతో.. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూ, పులిహోరా కొనుక్కొని వెళ్తున్నాడు. దీంతో మంగళవారం ప్రసాదం అమ్మకాల ద్వారా రూ.8,17,580  ఆదాయం వచ్చింది. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మరో రూ.10,52,190 ఆదాయం వచ్చింది.

హుండీ ఆదాయం రూ.49.63 లక్షలు

14 రోజులుగా భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండిని మంగళవారం ఈఓ గీతారెడ్డి పర్యవేక్షణలో  హరిత టూరిజం హోటల్ లో లెక్కించారు. ఇందులో రూ.49,63,871 క్యాష్​ రాగా.. 19 గ్రాముల బంగారం, కిలో 200 గ్రాముల వెండి వచ్చింది. ఇదిలా ఉండగా మంగళవారం నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన హనుమాన్ టెంపుల్ లో ఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజ వైభవంగా నిర్వహించారు.