యాదాద్రి దేవస్థానంలో మొక్కు వస్త్రాల లెక్కలపై గోప్యత ఎందుకు..?

యాదాద్రి దేవస్థానంలో మొక్కు వస్త్రాల లెక్కలపై గోప్యత ఎందుకు..?
  •     ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వలేమన్న యాదాద్రి ఆలయ అధికారులు
  •     న్యాయం కోసం మళ్లీ కమిషనర్‌‌‌‌కు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మొక్కు వస్త్రాల సేకరణ టెండర్ల వ్యవహారంలో ఆఫీసర్ల గోప్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాల టెండర్ల వివరాలు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరినా, దేవాలయాలు ఆ చట్టం పరిధిలోకి రావంటూ ఆఫీసర్లు చెబుతున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వివరాలు అందించాలని ఆదేశించినా ఆలయాధికారులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.

50 రోజుల తర్వాత కుదరదని లేఖ..

యాదగిరిగుట్ట గాంధీనగర్‌‌‌‌కు చెందిన అన్నలాదాస్ వెంకటేశ్ ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్​లో మొక్కు వస్త్రాల టెండర్ల వివరాలు కోరుతూ ఆర్టీఐ దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన సమాచార అధికారి, ఉప కమిషనర్ డి. కృష్ణప్రసాద్ దరఖాస్తును ఆలయ ఈవోకు బదిలీ చేసి గడువులోగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సుమారు 50 రోజుల తర్వాత ఈ నెల 5న సమాచారం ఇవ్వలేమంటూ ఆలయ ఈవో పేరుతో లేఖ పంపారు. దేవాలయాలకు ప్రభుత్వ నిధులు లేనందున ఆర్టీఐ చట్టం-2005 వర్తించదని, 2018లో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సాకుగా చూపారు. రాష్ట్ర సమాచార కమిషన్ ఉత్తర్వులను సైతం ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వెంకటేశ్ ఈ నెల 17న హైదరాబాద్‌‌‌‌లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేశారు.

పారదర్శకతపై అనుమానాలు..

దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం సమాచారం ఇవ్వాలని ఆదేశించినా, అదే శాఖ పరిధిలోని ఆలయాధికారులు నిరాకరించడం విమర్శలకు తావిస్తోంది. ఇది అధికారుల మధ్య సమన్వయ లోపమా? లేక సమాచారాన్ని దాచిపెట్టే ప్రయత్నమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉన్న నేపథ్యంలో టెండర్ల వంటి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్టీఐ దరఖాస్తుకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉండగా, 50 రోజుల తర్వాత సమాచారం నిరాకరించడం, సమాచార కమిషన్ ఉత్తర్వుల అమలుపై కూడా స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.