భక్తులతో యాదగిరిగుట్ట కిటకిట

భక్తులతో యాదగిరిగుట్ట కిటకిట
  •      వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు
  •     ధర్మదర్శనానికి 5 గంటలు , స్పెషల్ దర్శనానికి 2 గంటల  టైం 
  •     సండే ఒక్కరోజే రూ.89.65 లక్షల ఇన్ కమ్

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం, సోమవారం వరుస సెలవులు కావడంతో  హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తండోపతండాలుగా భక్తులు రావడంతో.. స్వామివారి ధర్మదర్శనానికి ఐదు, స్పెషల్ దర్శనానికి రెండు గంటలు పట్టింది. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తుల కారణంగా కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, పార్కింగ్ ఏరియా.. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం సందడిగా మారాయి.

 ఆదివారం 4,201 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. వీఐపీ టికెట్ల ద్వారా 13,505 మంది, బ్రేక్ దర్శనాల ద్వారా 2,514 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం రూ.89,65,064 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.28,19,150, వీఐపీ టికెట్లతో రూ.20,25,750, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.8.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.7,54,200, ప్రధాన బుకింగ్ తో రూ.2,59,800, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,17,600, యాదరుషి నిలయం ద్వారా రూ.2,70,660, కల్యాణకట్ట ద్వారా రూ.2,10,050 లక్షలు, సువర్ణపుష్పార్చన పూజలతో రూ.1,50,948 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. 

రేపు 'సామూహిక గిరిప్రదక్షిణ'

భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక, దైవ చింతన పెంపొందించడం కోసం యాదగిరిగుట్టలో మంగళవారం ‘సామూహిక గిరిప్రదక్షిణ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఈ నెల 18న స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా.. ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే సామూహిక గిరిప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఈ మేరకు గిరిప్రదక్షిణ మార్గాన్ని ఆదివారం ఆలయ ఆఫీసర్లు, ఆర్అండ్ బీ, ఇంజినీరింగ్ విభాగం ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. కాలినడకన కొండ చుట్టూ తిరిగారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న సమస్యలను గుర్తించి సామూహిక గిరిప్రదక్షిణ చేసే సమయంలోపు రిపేర్లను కంప్లీట్ చేయాలని సూచించారు. ఏఈవో గజవెల్లి రఘు, ఈఈలు దయాకర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, డీఈ మహిపాల్ రెడ్డి, ఎస్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ రూరల్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి సుమారు 50 వేలకు పైగా మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. భక్తులకు సరిపడా టాయిలెట్లు లేకపోవడం, టాయిలెట్ల కోసం క్యూలైన్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక తిప్పలు పడ్డారు.