యాదగిరిగుట్ట వేద పండితుడు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి

యాదగిరిగుట్ట వేద పండితుడు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన వేద పండితుడు వేణుగోపాల చార్యులకు గుండెపోటు రావడంతో ఆయనను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన అకాల మరణంపై యాదగిరిగుట్టలో వేద పండితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మే 23న యాదగిరిగుట్టకు రానున్నారు. అదే రోజు వేదపాఠశాల సహా టెంపుల్​ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గుట్టకు చేరుకున్న వెంటనే ఆయన ముందుగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం టెంపుల్​ సిటీకి చేరుకొని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు.

అనంతరం కొండపైన నిర్మించే కల్యాణ మండపం, దీక్షపరుల సదనం, మెట్ల మార్గానికి పై కప్పు, ప్రధానాలయం వాయువ్య దిశలో మాడ వీధుల్లోకి వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి శంకుస్థాపన చేస్తారు. కాగా కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి 22న యాదగిరిగుట్టకు  చేరుకుంటారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొంటారు. 32 మంది వేద పండితులతో చతుర్వేద పారాయణం తర్వాత భక్తులకు అనుగ్రహా భాషణం చేస్తారు.