యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు యాదగిరిగుట్ట ఈవోగా బాధ్యతలు ఇచ్చారు. గత ఏడాది ఆగస్టు 30న ఆయన రిటైర్ కాగా, యాదగిరిగుట్ట టెంపుల్ ఈవోగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలయ ఈవోతో పాటు శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శని, ఆదివారాలు మాత్రమే ఆలయానికి వచ్చేవారనే విమర్శలున్నాయి.
చింతపండు దొంగతనం వివాదంలో పెద్ద తలకాయల ప్రమేయం ఉందని, వారిపై చర్యలు తీసుకోలేదనే ప్రచారం జరిగింది. టెంపుల్ నిర్వహణ తదితర విషయాల్లో ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను పట్టించుకునేవాడు కాదనే విమర్శలున్నాయి.
ఇటీవల ఎమ్మెల్యేతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా వైకుంఠ ఏకాదశి వేడుకలకు సీఎం, గవర్నర్ ను ఆహ్వానించిన ఈవో, విప్ అయిలయ్యకు ఏఈవోతో ఇన్విటేషన్ పంపించారు. ఈ విషయంలో ఈవోపై ఎమ్మెల్యే, ఎంపీ సీరియస్ అయినట్లు సమాచారం. ఆయన రాజీనామాకు ఇవే కారణమని అంటుండగా, అనారోగ్య కారణాలతో తాను వైదొలుగుతానని సీఎస్‌కు చెప్పానని, ప్రభుత్వం రిలీవ్ చేశారని వెంకట్రావు మీడియాకు తెలిపారు.
