నర్సన్న క్షేత్రంలో అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనం

నర్సన్న క్షేత్రంలో అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనానికి, దేవస్థానం ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనానికి ఆలయ చైర్మన్ నరసింహామూర్తి, ఏఈవో గజవెల్లి రఘు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనం భక్తుల కోసం కొండపైన 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. 

అంబులెన్స్ నిర్వహణ మొత్తం మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యమే భరిస్తుందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అనుకోకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందించడానికి అంబులెన్స్ సేవలను తెచ్చామన్నారు. పెట్రోలింగ్ వాహనం.. భక్తుల భద్రత, రక్షణార్థం 24 గంటలు ఆలయ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అర్చకులు, ఎస్పీఎఫ్ పోలీసులు, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.