గొల్ల కురుమలకు రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి..యాదవ జేఏసీ డిమాండ్

గొల్ల కురుమలకు రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి..యాదవ జేఏసీ డిమాండ్
  • యాదవ జేఏసీ డిమాండ్
  • గాంధీ భవన్ ముట్టడికి యత్నం

ముషీరాబాద్, వెలుగు: యాదవులను(గొల్ల కురుమలు) కించపరుస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని.. వాటిని వెనక్కి తీస్కోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద కురుమ, యాదవ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జేఏసీ నాయకులు ఇందిరా పార్క్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఆ తర్వాత గాంధీ భవన్ ​వైపు వెళ్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పీఎస్​కు తరలించారు.

అంతకు ముందు జరిగిన నిరసన సభలో జేఏసీ నేతలు కడారి అంజయ్య యాదవ్, కో కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్, టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకుడు రాజారాం, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు రమేశ్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సంఘం జాతీయ అధ్యక్షుడు రాము యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కులాలు, కులవృత్తులను కించపరచడం రేవంత్ రెడ్డికి అలవాటేనని మండిపడ్డారు. గొల్ల కురుమలకు, మంత్రి శ్రీనివాస్ యాదవ్​కు ఈ నెల 24లోగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని గడువు ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కొల్ల కురుమలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.