యాదాద్రి గుడిపైనే బస్సు చార్జీల భారం

యాదాద్రి గుడిపైనే బస్సు చార్జీల భారం
  • యాదాద్రి గుడిపైనే బస్సు చార్జీల భారం
  • ‘కొండ మీదికి ఉచిత రవాణా’పై చేతులెత్తేసిన సర్కారు

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట పైకి భక్తులను తీసుకువెళ్తున్న ఆర్టీసీ బస్సుల బిల్లులను దేవస్థానమే భరిస్తోంది. రవాణా చార్జీలను తామే భరిస్తామని మొదట్లో చెప్పిన సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది. దీంతో దేవస్థానం మీద నెలకు రూ. 2.20 కోట్ల భారం పడుతోంది. ఇందులో భాగంగా మొదటి విడత డబ్బులను కూడా దేవస్థానం ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించింది. దీంతో ఆలయ నిర్వహణ కష్టమవుతుందని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నారు. ఈ మేరకు గురువారం ఈఓ గీతారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.  

తామే కడతమన్న సర్కారు

టెంపుల్​  పునః ప్రారంభం తర్వాత భక్తుల రద్దీ, స్థలాభావం, ట్రాఫిక్ సమస్యల పేరు చెబుతూ సర్కారు ఆటోలు, టూవీలర్లను కొండపైకి వెళ్లడాన్ని నిషేధించింది. మార్చి 28న టెంపుల్​ ఓపెన్​కాగా, 29వ తేదీ నుంచే భక్తులను ఉచితంగా కొండపైకి చేర్చడానికి , కిందకు తీసుకువెళ్లడానికి ఉచిత బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులకు నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.2.20 కోట్లను తామే కడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి నుంచి వీక్​డేస్​లో 20 నుంచి 25 బస్సులను 18 ట్రిప్పులు తిప్పుతూ సుమారు15 వేల మందిని కిందికి, పైకి తీసుకువెళ్తున్నారు.  వీకెండ్స్​లో అయితే ఈ సంఖ్యను పెంచి 40 నుంచి 45 బస్సులను తిప్పుతూ 30 వేల మంది భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. 

ఆలయంపై అదనపు భారం

బస్సులు ప్రారంభించినప్పుడు తామే ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వం తర్వాత వెనక్కి తగ్గింది. కొన్ని రోజులకే ‘ముందు మీరు అడ్జస్ట్​చేయండి. తర్వాత చూద్దాం’ అని చెప్పి దేవస్థానంపై ఉచిత బస్సులకయ్యే బిల్లుల భారాన్ని మోపింది. దీంతో రెండు నెలలకు సంబంధించిన సుమారు రూ.4  కోట్ల 40 లక్షల్లో  కోటి రూపాయలను మే 31న ఆలయ నిధుల నుంచే చెల్లించారు. టెంపుల్ ​పునర్నిర్మాణంతో  ఐదేండ్ల నుంచి అంతగా ఆదాయం రావడంలేదు. అద్దె గదులను తొలగించడం, షాపుల లైసెన్సులు రద్దు చేయడంతో ఇన్​కం ఇంకా తగ్గింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీనరీ, గార్డెన్​మెయింటెనెన్స్, శానిటేషన్, కరెంట్​కు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగాయి. ఆలయ సిబ్బంది, పెన్షనర్లు, భద్రతా సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం నెలకు దాదాపు రూ.2.50 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉచిత రవాణా బిల్లులు కట్టడం ఆలయానికి తలకు మించిన భారంగా మారింది.  


భారం పెరిగిన  మాట వాస్తవమే ప్రభుత్వం ఆర్టీసీకి బిల్లులు చెల్లించకపోవడం, ఆలయ నిధుల నుంచి కట్టడం వల్ల టెంపుల్​పై  భారం పెరిగింది. దీనివల్ల ఆలయ  నిర్వహణ కష్టమవుతుంది.  వివిధ ప్రతిపాదనలతో ఆలయ ఉద్యోగులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకుపోతాం. 


– గీతారెడ్డి, ఈఓ