ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. ఉప్పొంగిన నదులు.. కాలువలు..

ఉత్తరాదిని ముంచెత్తిన వాన..  ఉప్పొంగిన నదులు.. కాలువలు..
  • ఢిల్లీలో డేంజర్ లెవెల్ మార్కును దాటిన యమున ..
  • హిమాచల్​లో ఇప్పటి వరకు 320 మంది మృతి

న్యూఢిల్లీ: ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇన్ఫాస్ట్రక్చర్ తీవ్రంగా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం యమునా నది ప్రవాహం డేంజర్ లెవెల్​ను దాటింది. ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం దానిని దాటింది. యమునా నది ప్రవాహం 206 మీటర్లకు చేరుకుంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఢిల్లీలో భారీ వర్షాలకు నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

భారీ వర్షాలతో హిమాచల్ అతలాకూతలం

హిమాచల్​ప్రదేశ్​ను భారీ వర్షాలు అతలాకూతలం చేశాయి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ ఏజెన్సీ ప్రకారం.. వర్షాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 320కు చేరుకుంది.

పంజాబ్​లో భారీ వరదలు

పంజాబ్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. రాష్ట్రంలోని పఠాన్​కోట్, గురుదాస్​పూర్, ఫజిల్కా, కపుర్తలా, ఫిరోజ్​పూర్, హోషియార్​పూర్, అమృత్​సర్ జిల్లాల్లోని పలు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కాగా,  వర్షాల కారణంగా జమ్మూ–శ్రీనగర్ నేషనల్ హైవే వారం రోజులుగా మూతపడింది. వాతావరణం అనుకూలించగానే హైవే మరమ్మతుల పునరుద్ధరణ చేపడుతామని అధికారులు తెలిపారు.ఉత్తరాఖండ్​లో కొట్టుకుపోయిన వంతెన ఉత్తరాఖండ్​లో కురుస్తున్న భారీ వర్షాలకు తమంగ్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో జ్యోతిర్మత్– మలారి హైవేపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది.

తమిళనాడు, కర్నాటకలో కుండపోత

తమిళనాడు, కర్నాటకలో కుండపోత వర్షం కురిసింది. చెన్నై ఎయిర్​పోర్టుకు రావాల్సిన కొన్ని విమానాలను అధికారులు బెంగళూరుకు దారి మళ్లించారు. కర్నాటకలో లోతట్టు గ్రామాలను వరదలు ముంచెత్తాయి.