యాసంగి పంటలకు నీటి కష్టాలు

యాసంగి పంటలకు నీటి కష్టాలు

వనపర్తి, వెలుగు:  యాసంగి పంటలకు అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతుండంతో పైర్లకు చాలినంత నీరు అందట్లేదు. జూరాల, బీమా లిఫ్ట్ లో ఆయకట్టుకు మరో తడి అందిస్తే వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము పంటలు బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ పంటలకు సైతం నీళ్లివ్వలేని పరిస్థితి ఉంది. ఇటీవల వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్ మండలాల రైతులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ కష్టం చెప్పుకున్నారు. దీంతో ఆయన బీమా ఫేస్ 2 రిజర్వాయర్లలో నీటి నిల్వలను పరిశీలించారు. 

మరో తడి అందించాలని ఇరిగేషన్  ఎస్ఈని ఆదేశించారు. అయితే వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ చేయడంతో ఆ నీటిని కాలువలకు వదిలేందుకు అధికారులు జంకుతున్నారు. తాము యాసంగి సాగు చేయవద్దని పదేపదే రైతులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులు బోర్లు, బావుల ఆధారంగా పంటలు ఎలాగైనా పండించుకోవచ్చనే ధీమాతో వరి సాగు చేశారు. 

భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు ఎండిపోతుండగా, బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్  మండలాల్లో 10 వేల ఎకరాల్లో వేరుశనగ, గోపాల్ పేట, రేవల్లి, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోందని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు.