రాష్ట్రంలో భారీగా తగ్గిన యాసంగి సాగు

V6 Velugu Posted on Jan 22, 2022

 

  • రాష్ట్రంలో భారీగా తగ్గిన యాసంగి సాగు
  • వరి వేయొద్దని సర్కారు చెప్పిన ఫలితం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు భారీగా పడిపోయింది. ఎక్కడ కూడా పెద్దగా పంటలు కనిపించడం లేదు. ఇప్పటిదాకా మూడొంతుల సాగు భూమి పడావుగానే ఉంది. వరి వేయొద్దని సర్కారు చెప్పడం మొత్తం యాసంగి సాగుపైనే ప్రభావం చూపింది. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించినా.. విత్తనాలు అందక కొందరు, ఆ పంటలు తమ దగ్గర పండక ఇంకొందరు ఎవుసం బంద్​పెడ్తున్నారు. నిరుడు యాసంగి సీజన్​ మొత్తంలో అన్ని పంటలు కలిపి 68.14 లక్షల ఎకరాల్లో సాగైతే.. ఈసారి ఇప్పటివరకు 19.07 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. అంటే.. గత యాసంగితో పోలిస్తే ఇప్పుడు సాగవుతున్నది కేవలం 27 శాతమే. ఇంకా విస్తీర్ణం పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. నిరుడు జనవరి చివరి వారం నాటికి 37.82 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వరి వేస్తే ఉరే అని, యాసంగిలో వరి వేయొద్దని, వేస్తే తాము కొనబోమని సర్కారు చెప్పడంతో నిరుడు జనవరి చివరి వారంతో పోలిస్తే ఇప్పుడు పావు వంతు కూడా నాట్లు పడలేవు. చెరువుల కింద కూడా నీళ్లు వదలక పోవడంతో వరి సాగు బాగా తగ్గిపోయింది. నిరుడు జనవరి చివరి వారంలో 27.95 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి.  

లక్షల నుంచి వేల ఎకరాలకు పడిపోయిన వరి

నిరుడు యాసంగిలో ఈ టైమ్‌‌‌‌కు నల్గొండ జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇప్పుడు 96 వేల ఎకరాలకు పడిపోయింది. యాదాద్రి జిల్లాలో నిరుడు ఈ టైమ్​కు 98 వేల ఎకరాల్లో నాట్లేస్తే.. ఇప్పుడు 18వేల  ఎకరాల్లోనే వేశారు. కరీంనగర్‌‌‌‌ జిల్లాలో నిరుడు ఈ టైమ్​కు 1.65 లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. ఇప్పుడు 57 వేల ఎకారాల్లోనే నాట్లు పడ్డాయి.  పెద్దపల్లి జిల్లాలో నిరుడు 1.27లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. ఇప్పుడు 18 వేల ఎకరాలకే పరిమితమైంది. జగిత్యాల జిల్లాలో నిరుడు ఈ టైమ్​కు 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. ఇప్పుడు  4,473 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఒక్క నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోనే ఎక్కువగా  2.17 లక్షల ఎకరాల్లో ఈసారి వరి సాగవుతున్నది. 

ప్రత్యామ్నాయ పంటలు నామ్కేవాస్తే

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పల్లి, శనగ,  జొన్నలు, సజ్జలు, చిరు ధాన్యాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు, కందులు, పెసలు, మినుములు వేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఆ పంటలు ఆశించిన స్థాయిలో సాగవడం లేదు. చాలా మంది రైతులు తమ పొలాల్లో వరి తప్ప వేరే పండదని, వరి వేస్తే సర్కారు కొనదని తెలిసి సాగు చేయడమే మానేశారు. చిరు ధాన్యాలు 2.98 లక్షల ఎకరాలు, పప్పు దినుసులు 4.16 లక్షల ఎకరాలు, ఆయిల్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ 3.61 లక్షల ఎకరాలు, ఇతర పంటలు 68వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇలా ఎంత సాగు చేసినా వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు 11.43 లక్షల ఎకరాలకు మించలేదు. ప్రత్యామ్నాయ పంటల్లో రాగులు1,299 ఎకరాలు, కొర్రలు 265 ఎకరాలు, సజ్జలు 271 ఎకరాలు, నువ్వులు 4,528 ఎకరాలు, కందులు 3,086 ఎకరాలు, ఉలువలు 1,411 ఎకరాలు, పొద్దుతిరుగుడు 11,432 ఎకరాలు, పెసలు 13 వేల ఎకరాల్లో పండుతున్నాయి. 

వేరే పంటలని చెప్పి.. విత్తనాలియ్యలే!

ప్రత్యామ్నాయ పంటలు భారీగా సాగు చేయిస్తామని చెప్పిన వ్యవసాయశాఖ.. ఆచరణలో మాత్రం ఫెయిలైంది. పేరుకు విత్తన భాండాగారమని గొప్పలు చెప్పుకుంటున్నా.. రైతులు కోరుకున్న వెరైటీ విత్తనాలు సరఫరా చేయలేక పోయారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు పెద్దగా కనిపించడంలేదు. ఇప్పటికే అదును దాటి పోయిందని, ప్రభుత్వం స్పందించి వరిని ప్రోత్సహిస్తే కొద్దో గొప్పొ పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి..!పరిస్థితి ఉల్టా..!

రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్​లో ఇప్పటివరకు 7.64 లక్షల ఎకరాల్లోనే వరి నాట్లు పడ్డాయి. నిరుడు యాసంగి మొత్తంలో 52.98 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంత సాగవడం ఆల్‌‌టైమ్‌‌ రికార్డ్‌‌. కానీ ఈసారి మాత్రం పరిస్థితి ఉల్టా అయింది. పెద్దపల్లిలో నిరుడు ఈటైమ్‌‌కు యాసంగిలో 1.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే.. ఇప్పుడు 22 వేల ఎకరాల్లోనే వేశారు. జగిత్యాలలో నిరుడు ఈ టైమ్​కు 1.38 లక్షల ఎకరాల్లో వేస్తే.. ఇప్పుడు 25 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. సిరిసిల్లలో నిరుడు ఈ టైమ్​కు ఒక లక్షా 7 వేల ఎకరాలు సాగు చేస్తే.. ఇప్పుడు 8,225 ఎకరాలే సాగు జరిగింది. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో నిరుడు యాసంగిలో ఈ టైమ్‌‌కు 1.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. ఈసారి 60 వేల ఎకరాల్లోనే వేశారు. నల్గొండలో నిరుడు ఈ టైమ్​కు 3.93 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే.. ఇప్పుడు 1.19 లక్షల ఎకరాల్లోనే సాగవుతున్నది. 

దిక్కు తోస్తలేదు

ప్రతి సారి యాసంగికి ఐదు ఎకరాల్లో వరి వేస్తుంటిమి. వరి వేయొద్దని సర్కారు చెప్పుడుతోటి ఆగమైతున్నం. నిర్ణయాన్ని సర్కారు మార్చుకుంటుందని నెలరోజులు ఎదురుచూసినా ఫాయిదా లేకుండాపోయింది. యాసంగిల పంటలు వేయకుంటే నెలల తరబడి బోర్లు నడువక ఖరాబయ్యేటట్లు ఉన్నయ్​. మా దగ్గర ఇతర పంటలు 
పండే పరిస్థితి లేదు. వానాకాలం కంటే  యాసంగిలోనే వడ్లు ఎక్కువ పండుతయ్. కానీ, రాష్ట్ర  ప్రభుత్వ తీరు వల్ల రైతులకు దిక్కు తోస్తలేదు.
‑ రావుల గోవిందరెడ్డి, వెల్దండ, జనగామ జిల్లా

Tagged state, Yasangi cultivation, down drasticall

Latest Videos

Subscribe Now

More News