
ఐసీసీ బుధవారం (అక్టోబర్ 15) ప్రకటించిన లేటెస్ట్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్స్ మెరుగైన స్థానాల్లో నిలిచారు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన టీమిండియా ప్లేయర్స్ ర్యాంకింగ్స్ లో మంచి ఫలితాలను రాబట్టారు. విండీస్ తో సిరీస్ కు ముందు ఏడో స్థానంలో ఉన్న జైశ్వాల్.. ఐదో ర్యాంక్ కు చేరుకున్నాడు. విండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 219 పరుగులు చేసి ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో జైశ్వాల్ 175 పరుగులతో చెలరేగాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు. బ్రూక్, విలియంసన్, స్మిత్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ సిరీస్ ఆడకపోయినా పంత్ 8 వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. గిల్ 13 వ స్థానంలో ఉండగా.. రాహుల్ రెండు ర్యాంక్ లు మెరుగుపర్చుకొని 33 వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ లో బుమ్రా టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. బుమ్రా మినహాయిస్తే టీమిండియా బౌలర్లు ఎవరూ టాప్-10 లో స్థానం దక్కించుకోలేకపోయారు. విండీస్ తో జరిగిన సిరీస్ లో తన స్పిన్ మ్యాజిక్ తో రాణించిన కుల్దీప్ యాదవ్ ఏడు ర్యాంక్ లు ఎగబాకి 14 వ స్థానానికి చేరుకున్నాడు.
ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 12 ర్యాంక్ లో ఉన్నాడు. రబడా, హెన్రీ, కమ్మిన్స్, హేజాల్ వుడ్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. జడేజా ఒక స్థానం దిగజారి 18 ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు. ఆల్ రౌండర్ విభాగానికి వస్తే జడేజా ఎవరికి అందనంత దూరంలో అగ్ర స్థానంలో ఉన్నాడు. మెహదీ హసన్ మిరాజ్, స్టోక్స్, ముల్డర్, కమ్మిన్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. టెస్ట్ టీం ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉంటే.. ఇండియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.