బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు.  గురువారం గుర్రంపోడు మండలంలోని బ్రాహ్మణగూడెంలో కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి రైతు శ్రీనివాస్​యాదవ్ బత్తాయి తోటను పరిశీలించారు. నల్గొండ జిల్లా బత్తాయి సాగుకు ప్రసిద్ధి చెందిందని, వివిధ కారణాల వల్ల ఇటీవలి కాలంలో సాగు పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు.

నాబార్డు సహకారంతో రైతు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేసి, రైతులకు మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైతు తయారు చేసిన వర్మి కంపోస్టు, జీవ ఎరువులు, పురుగులను నియంత్రించే మందులను  పరిశీలించారు. అనంతరం రైతులు వారికి బత్తాయి, జామ, వాటర్ ఆపిల్ పండ్లను అందజేశారు. ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, ఉద్యాన అధికారి అనంతరెడ్డి, రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి తదితరులున్నారు. 

సేంద్రియ ఎరువుల ప్రాధాన్యం ఇవ్వాలి

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు: రైతులు బత్తాయి సాగులో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతం ఇవ్వాలని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. గురువారం కొండమల్లేపల్లిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన పరిశోధన కేంద్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి హాజరయ్యారు.

జీవ,సేంద్రియ ఎరువులు వాడితే బత్తాయి దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పారు. అనంతరం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులు నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాబార్డ్ సీజీఎం గణపతి, ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.