ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు

 ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు

అమరావతి: ఏపిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ సత్తా చాటుతోంది. ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ దూకుడు ధాటికి ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పత్తా లేకుండా పోతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నాలుగు కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో వైసీపీ ఘన విజయం సాధించింది. కర్నూలు కార్పొరేషన్ లో అంచనాలకు భిన్నంగా వైసీపీ మేయర్ అభ్యర్థి బీవై రామయ్య ఘన విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్‌, డాక్టర్ సుధాకర్‌లతోపాటు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడంతో  వైసీపీ భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఎంతో ఆశలు రేపిన ప్రతిపక్ష టీడీపీ ఓట్ల లెక్కింపులో చతికిలపడిపోయింది. పూర్తిగా చేతులెత్తేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరిగిన మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  మొత్తం 11 కార్పొరేషన్లు… 71మున్సిపాలిటీలకు ఈనెల 10న పోలింగ్ జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది. దీంతో మిగిలిన 11 కార్పొరేషన్‌లు, 70మున్సిపాలిటీల ఫలితాలు  వెలవడనున్నాయి. కార్పొరేషన్‌ల విషయానికి వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , నగరపాలక  ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
సాయంత్రానికంతా మొత్తం ఫలితాలు
11 నగరాలు, 71 పట్టణాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రానికల్లా మొత్తం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం  విస్తృత స్థాయిలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు. 4,026 బుళ్లు.. 4,317 మంది సూపర్‌వైజర్లు, 12,607 మంది కౌంటింగ్‌ సిబ్బందితోపాటు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 మంది పోలీసులను నియమించారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు... 1,345 మంది ఎస్సైలు... 17,292 మంది కానిస్టేబుళ్లతో పాటు 1,134 మంది ఇతర సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.కోర్టు ఆదేశాలతో ఏలూరులో కౌంటింగ్‌ నిలిపివేయగా... చిలకలూరిపేటలో లెక్కించినా ఫలితం ప్రకటించడం లేదు. ఈనెల 18వ తేదీన మేయర్ల ఎన్నిక జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.