చంద్రగిరిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. సీఐ కాళ్లు పట్టుకున్న వైసీపీ నేత

చంద్రగిరిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. సీఐ కాళ్లు పట్టుకున్న వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అడ్డు అదుపు లేకుండా లారీల్లో తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇసుక అక్రమ రవాణాపై తిరగబడ్డారు. అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ నాయకుడు సీఐ కాళ్లు పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు కొందరు అధికార పార్టీ నాయకులు. ఈ విషయం తెలియడంతో స్థానికంగా ఉండే వైసీపీ నాయకుడు, నరసింగాపురం సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి తన అనుచరులతో వెళ్లారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న చోట తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చంద్రమౌళిరెడ్డి.. చంద్రగిరి సీఐ కాళ్లు పట్టుకున్నాడు. ఇసుక అక్రమ రవాణా ఇలానే కొనసాగితే ధర్నా చేయడంతో పాటు ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ప్రభుత్వ విప్ గానూ కొనసాగుతున్నారు.