మహిళా వాలంటీర్ కాళ్లు కడిగిన వైసీపీ ఎమ్మెల్యే

మహిళా వాలంటీర్ కాళ్లు కడిగిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో ప్రసంగిస్తూ వాలంటీర్ల గురించి సంచలన ఆరోపణలు చేశారు. మహిళా అదృశ్యం కేసులు వెనుక వాలంటీర్స్ సేకరిస్తున్న డేటా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దీనిపై అధికార పార్టీతో పాటు వాలంటీర్ల పవన్ కల్యాణ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు.

సేవే లక్ష్యంగా భావించి, గౌరవవేతనంతో ప్రజలకు సేవ చేస్తున్న తమపై  చేసిన ఈ వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఈ వివాదం ఇలా నడుస్తుండగానే  మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే  వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మహిళా వాలంటీర్ కాళ్లు కడిగి సన్మానించారు. దుగ్గిరాల మండలం ఈమనిలో రజిత అనే మహిళా వాలంటీర్ కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. కరోనా సమయంలో విశిష్ట సేవలు వాలంటీర్లు అందించారన్నారు.

వాలంటీర్లు అతి తక్కువ గౌరవ వేతనంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రపంచం మొత్తం ప్రాణభయంతో వణికిపోతున్న వేళ వాలంటీర్లు ప్రాణాల సైతం ప్రణంగా పెట్టి ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందించారని ఆర్కే గుర్తు చేశారు.  బయటికి రాలేని వృద్ధులకు, నడవలేని వికలాంగులకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నారని, ఇలాంటి వాలంటీర్ల పై రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్న వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వాలంటీర్ కాళ్లు కడిగి సన్మానం చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.