బూడిదతో ఏటా రూ. 7 కోట్ల ఆదాయం

బూడిదతో ఏటా రూ. 7 కోట్ల ఆదాయం
  • బూడిదే బంగారం!
  • సింగరేణి ఎస్టీపీపీకి కాసులు కురిపిస్తున్న ఫ్లైయాష్​
  • రోజుకు 6,300 టన్నుల ఉత్పత్తి 
  • ఏటా రూ.7 కోట్ల ఆదాయం

మందమర్రి/జైపూర్, వెలుగు: బూడిద.. ఈ మూడక్షరాల పదం వింటే ఎవరైనా వేస్ట్​అంటుంటారు. కానీ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి ఎస్టీపీపీ మాత్రం బొగ్గు మండించడం ద్వారా వెలువడిన బూడిద(ఫ్లైయాష్​)తో అద్భుతాలు సృష్టిస్తోంది. బూడిదతోనూ పలు విధాలుగా ప్రయోగాలు చేసి సంస్థకు ఆదాయం​ తీసుకురావడంతో  పాటు ప్రజలకు చౌకగా సౌకర్యాలు కల్పిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్​మండలం పెగడపల్లి వద్ద గల సింగరేణి థర్మల్​ పవర్​ప్లాంట్​యాజమాన్యం బూడిద వినియోగంలో మరో అడుగు ముందుకేసింది. ఇది వరకు బొగ్గును తవ్వి తీసిన సింగరేణి బొగ్గు గనుల్లో బూడిదను ఇసుకతో కలిపి పూడికకు ఉపయోగించేది. కొద్ది రోజులుగా బూడిదను లోకల్, ఇతర రాష్ట్రాల్లోని సిమెంట్​సంస్థలకు విక్రయిస్తూ  ఏటా రూ.7 కోట్ల ఆదాయాన్ని  గడిస్తోంది. మరోవైపు స్థానికంగా ఉన్న చిన్న తరహా సిమెంట్​ అనుబంధ సంస్థలకు ఫ్లైయాష్​ను ఫ్రీగా అందజేస్తూ కాలుష్య నివారణ చర్యల్లో ఆదర్శంగా నిలుస్తోంది. 
రెండు రకాల ఫ్లైయాష్​
సింగరేణి సంస్థ జైపూర్​లోని పవర్​ ప్లాంట్​ మొదటి యూనిట్​ను 2016 మార్చి 3న, రెండో యూనిట్​జూన్​1న షురూ చేసింది. ఈ పవర్​ప్లాంట్​లోని రెండు యూనిట్ల నుంచి రోజుకు 28.08 మిలియన్​యూనిట్ల పవర్​ను ఉత్పత్తి చేస్తోంది. 162 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్​సబ్​స్టేషన్​కు గ్రిడ్​ద్వారా సరఫరా చేస్తోంది. ప్రతి రోజు సుమారు 16 వేల టన్నుల బొగ్గును వినియోగిస్తోంది. అందులో నుంచి సుమారు 7 వేల టన్నుల బూడిద  వెలువడుతోంది. బొగ్గును మండించిన తర్వాత 5.3 మైక్రాన్ల మందంతో ఇసుక రేణువుల మాదిరిగా హాపర్స్​ ద్వారా బయటకు వచ్చేది బాటమ్​యాష్​, బూడిద మాదిరిగా సిలోన్​ ద్వారా బయటకు వచ్చేది ఫ్లైయాష్​. రోజుకు బాటమ్​యాష్ 1,800 టన్నులు,  ఫ్లైయాష్​ 4,500 టన్నులు వెలువడుతుంది. 
బొగ్గు గనుల్లోకి బాటమ్​యాష్​
సింగరేణి అండర్​గ్రౌండ్​మైన్స్​లో బొగ్గును వెలికి తీసిన తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను(స్టవింగ్​ సిస్టం) గతంలో ఇసుకతో నింపేవారు. ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది. దీంతోపాటు నదిలోని ఇసుకను తీయడం వల్ల గ్రౌండ్​ లెవల్​ వాటర్​ తగ్గుతుండేది. ఈ సమస్యను అధిగమించేందుకు సింగరేణి యాజమాన్యం బూడిదతో స్టవింగ్​ చేయడం మొదలుపెట్టింది. సింగరేణి సంస్థ సొంతంగా పవర్​ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో సంస్థకు బాటమ్ యాష్​ విరివిగా దొరుకుతోంది. బెల్లంపల్లి, రామగుండం రీజియన్​లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న  మైన్స్​కు బాటమ్​యాష్​సరఫరా చేస్తోంది.   
ఇతర ప్రయోజనాలు
బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద సమీప ప్రాంతాలను కాలుష్య కోరల్లో ముంచుతుంది. అలా వచ్చిన బూడిదను పవర్​ ప్లాంట్​లో నిల్వ చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కాలుష్యాన్ని నివారిస్తున్నారు. రోడ్ల నిర్మాణంలో అడుగున వేసేందుకు ఈ బూడిదనే వాడుతున్నారు. సిమెంట్​ వినియోగం లేకుండా కేవలం బూడిదతో ‘జియో పాలిమర్​రోడ్’ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోని దారుల్లో ఏర్పడే గుంతలను పూడ్చడానికి, లోతట్టు ప్రాంతాలను సమతలం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. స్థానికంగా ఉన్న చిన్న తరహా సిమెంట్​అనుబంధ సంస్థకు ఎస్టీపీపీ యాజమాన్యం ఫ్లైయాష్​ను ఫ్రీగా సప్లయ్​ చేస్తోంది. 

సిమెంటు, ఇటుక పరిశ్రమలకు ఫ్లైయాష్​
పవర్ ప్లాంట్​నుంచి వస్తున్న ఫ్లైయాష్​ను ఇటుక, సిమెంట్​ తయారీలో వినియోగిస్తున్నారు. దీనికి కాల్షియం కలిపితే సిమెంట్​లా పని చేస్తుండటంతో ఈ ఇండస్ర్టీస్​లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి రోజు 4,500 టన్నుల వరకు ఫ్లైయాష్​ వెలువడుతోంది. 43 గ్రేడ్​ సిమెంట్ లో 30 శాతం, 53 గ్రేడ్​ సిమెంట్​లో 10 శాతం బూడిదను కలుపుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, కాగజ్​నగర్, మంచిర్యాల ప్రాంతాల్లోని పలు సిమెంట్​పరిశ్రమలకు ఫ్లైయాష్​ ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది.  సిమెంట్​ పరిశ్రమలకు టన్నుకు రూ.50, కాంక్రీట్​తయారీ సంస్థలు రూ.55 చొప్పున కొంటున్నాయి. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ఇటుకల తయారీ పరిశ్రమలకు బూడిదను తీసుకువెళ్తున్నారు. సింగరేణి సంస్థ కూడా తన అవసరాలకు మట్టి ఇటుకలకు బదులుగా బూడిదతో తయారు చేసిన ఇటుకల్ని వినియోగిస్తోంది. ఫ్లైయాష్, బాటమ్​ యాష్​అమ్మడం ద్వారా ఎస్టీపీపీకి  నెలకు రూ.60 లక్షల వరకు, ఏటా రూ.7 కోట్లకుపైగా ఆదాయం వస్తోందని ప్లాంట్​ఆఫీసర్లు పేర్కొంటున్నారు.