కురుమలకు ప్రత్యేక..కార్పొరేషన్ కావాలి : యెగ్గే మల్లేశం

కురుమలకు ప్రత్యేక..కార్పొరేషన్ కావాలి : యెగ్గే మల్లేశం

ఖైరతాబాద్/బషీర్ బాగ్, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమలకు కలిపి ఒకటే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కరెక్ట్​కాదని తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం అన్నారు. కురుమ సామాజిక వర్గం ఎన్నో ఏండ్లుగా ఆర్థికంగా, రాజకీయం వెనుకబాటుకు గురైందని చెప్పారు. గొల్లలు తమ కంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు.

కురుమ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కార్పొరేషన్​ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్​మీట్​నిర్వహించారు. గొర్రెలు, మేకల ఫెడరేషన్(షీప్) ఏర్పాటు చేస్తే దానికి కురుమ సామాజిక వర్గానికి చెందిన వారినే చైర్మన్​గా నియమించాలని కోరారు. ఈ విషయమై సీఎం రేవంత్​రెడ్డికి వినతి పత్రం అందజేయనున్నట్లు మల్లేశం తెలిపారు. సమావేశంలో షెఫర్డ్​ఇండియా ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్, సంఘం జనరల్​సెక్రటరీ బండారు నారాయణ, సంఘం సభ్యులు కె.నర్సింహ, టి.అరుణ్​కుమార్, విజయ్, రాఘవేందర్, భూమన్న, శ్రీనివాస్, రమేశ్, విజయ, బాలమణి పాల్గొన్నారు.

అలాగే రాష్ట్రంలో 10 శాతం ఉన్న కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలంపల్లి రమేశ్​కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు లెటర్​రాసినట్లు తెలిపారు. గురువారం ఆయన కాచిగూడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2 శాతంగా ఉన్న వైశ్యులకు, 4 శాతంగా ఉన్న రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు, 10 శాతం ఉన్న కురుమలకు, యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ డిమాండ్​చేస్తూ 17న ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా తలపెట్టినట్లు వెల్లడించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.