రూ.18 కోట్లు ఖర్చు పెట్టి పడావుబెట్టారు

రూ.18 కోట్లు ఖర్చు పెట్టి పడావుబెట్టారు

ప్రారంభానికి ముందే మూలనపడిన ఎల్లంపల్లి– బెల్లంపల్లి వాటర్​ స్కీమ్

కొత్తగా మిషన్​భగీరథ కింద రూ.40 కోట్లతో పైపులైన్​ పనులు

30 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్లంపల్లిని వదిలేసి..

50 కిలోమీటర్ల దూరంలోని కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి నీళ్లు

ఎలుకలు ఉన్నాయని ఇల్లుకు నిప్పు పెట్టినట్లుగా.. లీకేజీలు ఉన్నాయంటూ రూ.18 కోట్లతో చేపట్టిన ‘ఎల్లంపల్లి టు బెల్లంపల్లి’ వాటర్​ స్కీమ్ ను ప్రారంభించక ముందే పక్కనపెట్టేశారు. బెల్లంపల్లి పట్టణానికి గోదావరి జలాలు అందించేందుకు 2013లోనే పూర్తి చేసిన ఈ పథకాన్ని పక్కన పడేసి.. కొత్తగా మిషన్​భగీరథ కింద రూ.40 కోట్లతో మరో పైపులైన్​ వేస్తున్నారు. 30 కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును వదిలి 50 కి.మీ. దూరంలోని కుమరంభీం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నరు. ఓ బడా కాంట్రాక్టు సంస్థకు లబ్ధి చేకూర్చడం ద్వారా జేబులు నింపుకునేందుకే రూ.18 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెండు పథకాలను కాదని..

మంచిర్యాల జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు కలిపి 20 ఏండ్ల కింద రూ.24 కోట్లతో ‘గోదావరి రక్షిత మంచినీటి పథకం’ నిర్మించారు. ముల్కల్ల శివారులో గోదావరి ఒడ్డున పంపుహౌస్​ కట్టారు. ముల్కల్ల నుంచి బెల్లంపల్లి వరకు 400 మిల్లీమీటర్ల పైపులైన్​ వేశారు. రెండు మున్సిపాలిటీలకు కలిపి మందమర్రిలో వేర్వేరుగా సంప్​ హౌస్​లు ఏర్పాటు చేశారు. వారంలో తలా మూడు రోజుల చొప్పున నీటిని వాడుకునేలా పథకాన్ని రూపొందించారు. కానీ రెండు పట్టణాల్లో తరచూ నీటి సమస్య తలెత్తింది. ముఖ్యంగా బెల్లంపల్లిలోని కొన్ని వార్డులకు వారానికోసారి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. దీంతో గోదావరి జలాలను బెల్లంపల్లి మున్సిపాలిటీకి తరలించేందుకు ‘ఎల్లంపల్లి టు బెల్లంపల్లి వాటర్​ స్కీం’ను తెరపైకి తెచ్చారు.

ప్రారంభించక ముందే..

2008లో యూఐడీఎస్ఎస్ఎంటీ (అర్బన్​ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ స్కీమ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్) కింద రూ.18 కోట్లతో ‘ఎల్లంపల్లి టు బెల్లంపల్లి వాటర్​ స్కీం’మంజూరైంది. టెండర్ దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ర్టక్చర్స్​ లిమిటెడ్​ సంస్థ 2009లో పనులు ప్రారంభించి 2013లో పూర్తి చేసింది. ఏడాదిలోనే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా నాలుగేండ్లు సాగదీసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పంపుహౌస్​ నిర్మించి మందమర్రి వరకు 23 కిలోమీటర్ల పొడవునా 500 మిల్లీమీటర్ల  వ్యాసమున్న పైపులైన్​ వేశారు. మందమర్రి నుంచి బెల్లంపల్లి వరకు పాత ‘గోదావరి రక్షిత మంచినీటి పథకం’పైపులైన్​తో అనుసంధానించారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్​ సమీపంలో సంపులు నిర్మించి, అక్కడినుంచి పట్టణంలోని నల్లాలకు నీటిని సరఫరా చేసేలా డిజైన్ చేశారు. కానీ 2014లో నిర్వహించిన ట్రయల్​ రన్​లో పలుచోట్ల లీకేజీలు బయటపడ్డాయి. ఇలా లీకేజీలు బయటపడితే లోపాలను సరిదిద్ది, రిపేర్లు చేసి ఇవ్వాల్సిన బాధ్యత సదరు కాంట్రాక్టు సంస్థదే. కానీ ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక అధికారులు ఆ దిశగా చర్యలేవీ తీసుకోలేదు. లీకేజీల సాకు చెప్పి ఇప్పటికీ పథకాన్ని ప్రారంభించలేదు. రూ.18 కోట్లు ఖర్చు చేసినా ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు.

మిషన్​ భగీరథ కింద కొత్తగా మరో పైపులైన్..

ఎల్లంపల్లి టు బెల్లంపల్లి స్కీంను వినియోగంలోకి తేలేకపోయిన అధికారులు, బెల్లంపల్లి పట్టణాన్ని కొత్తగా మిషన్​ భగీరథ పథకంలో చేర్చారు. రూ.40 కోట్ల ఖర్చుతో ఆసిఫాబాద్​ జిల్లా కుమ్రం భీం రిజర్వాయర్​ నుంచి బెల్లంపల్లికి, ఈ సెగ్మెంట్‌‌లోని ఇతర గ్రామాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. నాలుగేళ్లుగా ఈ పనులు సాగుతునే ఉండటంతో.. బెల్లంపల్లి పట్టణానికి ఇంకా పాత పథకం కింద వస్తున్న నీళ్లే దిక్కవుతున్నాయి.