ఇల్లెందు, వెలుగు : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇల్లెందు హజరత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా ఉర్సు గురువారం సంప్రదాయ రీతిలో కన్నుల పండువగా నిర్వహించారు. 23ఏళ్లుగా కులమతాలకతీతంగా పెద్ద ఎత్తున సాగే హజరత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా ఉత్సవాలకు ఈ సారీ కూడ వేలాదిగా జనం తరలివచ్చారు.
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే అమావాస్య రోజున నిర్వహించే ఈ ఉర్సు మహోత్సవం పట్టణంలోని సత్యనారాయణపురం శివారు అటవీ ప్రాంతంలో కొలువుదీరిన నాగుల్ మీరా దర్గాలో రెండు రోజులపాటు ఉర్సు నిర్వహిస్తారు. చివరి రోజైన గురువారం ఉర్సు వేడుకల్లో భాగంగా పట్టణంలోని నెం.2 బస్తీ హజరత్ ఖాసీం దుల్హా దర్గా నుంచి నాగుల్ మీర దర్గా వరకు జులూస్ సంప్రదాయ రీతిలో నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బగ్గీపై హజరత్ నాగుల్ మీరా నిషానీతో పట్టణంలోని వీధుల్లో మాల ధారణ చేసిన అయ్యప్ప స్వాములు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు డప్పు చప్పులతో, మహిళల కోలాట నృత్యాలతో ఊరేగింపుగా కోలాహలంగా కొనసాగింది. ఒంటేలపై వెండి నిషానీలను, గుర్రపు బగ్గీలపై ఖందీలన్ పెట్టి జులూస్ నిర్వహించారు.
