- బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు హౌతీల ప్రకటన
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్ మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ రెబెల్స్ ప్రకటించారు. ఈ దాడిలో విమానాశ్రయంలోని ఓ ఖాళీ విమానం నుంచి దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ గురువారం వెల్లడించింది.
భద్రతా కారణాల దృష్ట్యా రియాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఫ్లైట్‌రాడార్ 24 ధ్రువీకరించింది. చివరి ల్యాండింగ్, టేకాఫ్ జరిగి గంటకు పైగా సమయం కావడంతో విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పేలుళ్ల కారణంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బుధవారం జరిగిన రెండు విమానాశ్రయ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
యెమెన్ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తుండడంతో, హౌతీలు సౌదీ లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేశారు. రియాద్ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని కూటమి పేర్కొంది.
అయినప్పటికీ, భద్రతా ప్రమాదాల నేపథ్యంలో రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (కేఏఎఫ్డీ) లోని పలు బహుళజాతి సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశించాయి. దౌత్య కార్యాలయాలకు భద్రతా హెచ్చరికలు జారీ కాగా, పలు స్కూళ్లలో విద్యార్థులను సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.
మక్కా ఒప్పందం కింద హౌతీలపై పాక్ దాడులు
యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ రెబెల్స్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వాయుసేన (పీఏఎఫ్) యుద్ధ విమానాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. సౌదీ, పాకిస్తాన్, టర్కీ దేశాల మధ్య ఇటీవల అమల్లోకి వచ్చిన 'మక్కా రక్షణ ఒప్పందం' కింద పాక్ సైనిక మద్దతును మరింత పెంచినట్లు సమాచారం.
ఈ ఒప్పందంలో భాగంగా సౌదీలో సుమారు 8,000 మంది పాకిస్తానీ సైనికులు మోహరించినట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, సౌదీలోని విమానాశ్రయాలపై జరిగిన దాడులను భారత ప్రభుత్వం ఖండించింది.
