ప్రియాంక గాంధీపై రాణా కపూర్ సంచలన ఆరోపణలు

ప్రియాంక గాంధీపై రాణా కపూర్ సంచలన ఆరోపణలు

రూ.5 వేల కోట్ల స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు కో ఫౌండర్ రాణా కపూర్ సంచలన ఆరోపణలు చేశాడు. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA) కింద తనపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED ) ముందు రాణా కపూర్ కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నుంచి ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన రూ.2 కోట్ల విలువైన పెయింటింగ్ ను కొనుగోలు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు రాణా కపూర్ ఆరోపించారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. బదులుగా తనకు పద్మభూషణ్ పురస్కారం ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఈడీ ఈ అంశాలను  ప్రస్తావించింది. 

చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్ లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు మురళీ దేవరా తనయుడు మిలింద్ దేవరా తనకు తర్వాత రహస్యంగా తెలిపినట్లు రాణా కపూర్ చెప్పాడని ఈడీ ఎదుట వివరించాడు. అయితే తనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని వాపోయాడు. ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ కొనుగోలు బలవంతంగా జరిగిందని, అది తనకు ఇష్టం లేదని రాణా పేర్కొన్నట్లు ఛార్జిషీట్ లో ఈడీ పేర్కొంది.

దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) సంస్థకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిఫలంగా రూ.600 కోట్లు లబ్ధి పొందారనే ఆరోపణలపై రాణా కపూర్, ఆయన కుటుంబం, డీహెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్ కపిల్ వాద్వాన్ లపై ఈడీ, సీబీఐలు వేర్వేరుగా కేసు నమోదు చేశాయి. ప్రస్తుతం రాణా కపూర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రాణా కపూర్,  డీహెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాద్వాన్ లు అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.5,050 కోట్ల నగదును అక్రమంగా బదిలీ చేశారని ఈడీ తాజాగా ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ లో పేర్కొంది. అయితే ఈడీ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. 

మరిన్ని వార్తల కోసం..

ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు

వరుస సినిమాలతో బిజీగా రష్మిక