మొన్న చట్టం.. నిన్న సవరణ : మున్సిపల్​ పై గవర్నర్​ అభ్యంతరాలు

మొన్న చట్టం..  నిన్న సవరణ : మున్సిపల్​ పై గవర్నర్​ అభ్యంతరాలు

మార్చకుంటే బిల్లును కేంద్ర హోంశాఖకు పంపాల్సిన పరిస్థితి

సవరణలకు సర్కారు ఓకే చెప్పడంతో బిల్లుపై సంతకం

కొత్త చట్టం అమల్లోకి.. ఆ వెంటనే సవరణలతో ఆర్డినెన్స్

మున్సిపోల్స్తేదీలను సర్కారే నిర్ణయించే అంశం తొలగింపు!

కలెక్టర్లకు అసాధారణ అధికారాల్లోనూ మార్పులు?

ఆర్డినెన్స్​ను అధికారికంగా బయటపెట్టని సర్కారు

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో కొత్త మున్సిపల్​ చట్టం అమల్లోకి వచ్చింది.. కానీ అందులోని అంశాలపై గవర్నర్​ అభ్యంతరం చెప్పడంతో సవరణలతో ఆర్డినెన్స్​ కూడా ఇచ్చేసినట్టు తెలిసింది. మున్సిపల్​ ఎలక్షన్ల తేదీల ఖరారు అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించడం, కలెక్టర్లకు అసాధారణ అధికారాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని గవర్నర్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ఈ రెండు అంశాలల్లో మార్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ ఆర్డినెన్స్​ను సర్కారు అధికారికంగా బయటపెట్టలేదు.

 మూడు రోజుల కిందటే..

‘తెలంగాణ మున్సిపల్‌ బిల్లు–2019’ను ఈ నెల 18న శాసనసభలో
ప్రవేశపెట్టి, మరుసటి రోజు చర్చ అనంతరం ఆమోదించారు. శాసన మండలిలో 19వ తేదీన ప్రవేశపెట్టి ఆమోదించాక.. గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. అయితే అదే రోజు సాయంత్రం బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, డీకే అరుణ ఆధ్వర్యంలోని బృందం గవర్నర్‌ ను కలిసి మున్సిపల్​ చట్ట బిల్లులోని అంశాలపై ఫిర్యాదులు చేసింది. ఎన్నికల తేదీలను ప్రభుత్వమే ప్రకటిస్తుందనడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని, 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన విశేషాధికారాలను కలెక్టర్లకు అప్పగించడం కూడా సరికాదని వివరించింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న గవర్నర్‌.. ఈ నెల 20న పలువురు ఉన్నతాధికారులను పిలిపించి మున్సిపల్‌ బిల్లులోని అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎన్నికల తేదీల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం, స్థానిక సంస్థల అధికారాలకు సంబంధించిన పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ సవరణలు వీలుకాని పక్షంలో రాజ్యాంగపరమైన అంశాల పరిశీలన నిమిత్తం మున్సిపల్​ బిల్లును కేంద్రానికి పంపిస్తానని చెప్పినట్టు సమాచారం. అదే రోజున అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్​ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. ఆదివారం (21న) సెక్రటేరియట్​కు వచ్చిన సీఎస్.. మున్సిపల్​ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై.. కొత్త బిల్లులో మార్పులపై చర్చించినట్టు తెలిసింది. అభ్యంతరం చెప్పిన అంశాలను సవరిస్తామని సర్కారు హామీ ఇవ్వడంతో.. గవర్నర్​ బిల్లుపై సంతకం చేశారు. కొత్త చట్టంలో గవర్నర్​ అభ్యంతరాల మేరకు కొన్ని అంశాల్లో మార్పులు చేస్తూ అధికారులు ఆర్డినెన్స్​ను సిద్ధం చేశారు. దానికి గవర్నర్​ మంగళవారం ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. అయితే దీనిని న్యాయ శాఖ ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు.

సీఎం దగ్గరుండి రాయించినా..!

మున్సిపల్‌ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. అందులో ప్రతి పదాన్ని తానే దగ్గరుండి రాయించానని అసెంబ్లీలో చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం సర్కారుకే ఉంటుందని కూడా అన్నారు. ఇప్పుడవే అంశాలపైన అభ్యంతరాలు రావడం ఆసక్తి రేపుతోంది.

మళ్లీ చర్చించాల్సి వస్తుందనే అసెంబ్లీ ప్రోరోగ్‌?

గవర్నర్‌  సూచించిన సవరణలను బిల్లులో చేరిస్తే.. తిరిగి శాసనసభ, మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. గవర్నర్‌ అభ్యంతరాలు చెప్పిన శనివారం నాటికి అసెంబ్లీ టెక్నికల్‌గా కొనసాగుతూనే ఉంది. మళ్లీ సమావేశపరిచే అవకాశం కూడా ఉంది. కానీ మళ్లీ అసెంబ్లీ, మండలిలో అధికార, విపక్షాలు బిల్లుపై, సవరణలపై చర్చించాల్సి వస్తుంది. అందుకే అదే రోజున సాయంత్రం తర్వాత అసెంబ్లీ, మండలి సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తర్వాతే కొత్త చట్టానికి ఆమోదం చెప్పడంతో.. దానిలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్​ ఇవ్వడానికి వీలు కలిగింది. మున్సిపల్‌ బిల్లులో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం వాస్తవమేనని, దానిని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు.