
యోగాసనాలు రోజూ చేయడంవల్ల ఆరోగ్యంగానే కాదు, శరీరం, మనసు, ఆత్మ ఒకే దారిలో పనిచేస్తాయని అంటారు యోగా గురువులు. అయితే, ప్రతిరోజూ యోగాసనాలు చేసేవాళ్లు డైరెక్ట్‌గా ఆసనాలు వేయడంతో మొదలుపెట్టకుండా ముందు కొంత వామప్ చేయాలి అంటోంది యోగా ట్రైనర్ షైనీ నారంగ్. ఇలా చేయడంవల్ల వంద శాతం రిజల్ట్ వస్తుందని చెప్తుంది.
వక్షస్థల శక్తి : దీన్నే ఇంగ్లీష్‌లో టార్సో స్ట్రెంత్ ఇంక్రీజ్ ఎక్సర్‌సైజ్ అంటారు. ఈ వ్యాయామం చేయడం వల్ల ఛాతి, మెడలో బలంతోపాటు, ఊపిరితిత్తుల పనితనం కూడా పెరుగుతుంది. పొత్తి కడుపు సాగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ వ్యాయామాన్ని ఎలా చేయాలంటే.. శరీరాన్ని ఫ్రీగా ఉంచాలి. కాళ్లు దగ్గరగా పెట్టి నిటారుగా నిల్చోవాలి. చేతుల్ని పైకి ఎత్తి నెమ్మదిగా సాధ్యమైనంత వెనక్కి వంగాలి. అలా కొద్దిసేపు ఉండి మళ్లీ తిరిగి మామూలుగా నిలబడాలి.
సర్వాంగ పుస్టి: ‘సర్వ్’ అంటే ‘మొత్తం’, ‘అంగ్’ అంటే ‘శరీర భాగాల’ని అర్థం. అంటే ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్న అన్ని భాగాలకి ఎక్సర్‌సైజ్ అవుతుంది. వాటిలో కదలిక జరుగుతుంది. రెండు కాళ్లని ట్రయాంగిల్‌లా పక్కకు చాపాలి. ముందు చేతి బొటన వేలు, తరువాత నాలుగు వేళ్లు మడిచి పిడికిలి బిగించాలి. చేతుల్ని పైకెత్తి ‘క్రాస్’లా పెట్టాలి. కొంచెం వెనక్కి వంగాలి. తరువాత గుండ్రంగా తిరిగినట్టు పక్కనుంచి ముందుకు వంగి నుదిటితో మోకాలిని అందుకోవాలి.
పూర్ణభుజ శక్తి : చేతి కండరాల్లో బలం, భుజాల దగ్గర కీళ్ల పనితీరు పెరగడానికి ఈ వ్యాయామం చేయాలి. దీన్నే ఫుల్ ఆర్మ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ ఎక్సర్‌సైజ్ అంటారు. కాళ్లు దగ్గరగా పెట్టుకొని నిటారుగా నిల్చోవాలి. తరువాత చేతి బొటన వేలిని ముందు మడిచి తరువాత మిగతా నాలుగు వేళ్లని మడిచి పిడికిలి మూయాలి. గాలి పీల్చి వదులుతూ రెండు చేతుల్ని గుండ్రంగా వెనక్కి తిప్పాలి. ఇలా 10 సార్లు చేశాక అలానే ముందు వైపు కూడా చేస్తూ ఈ వ్యాయామాన్ని చేయాలి.
జంఘ శక్తి (క్రియ2): ఈ వ్యాయామాన్ని ఎలాచేయాలంటే.. కాళ్లు దగ్గరగా పెట్టి శరీరాన్ని ఫ్రీగా ఉంచి నిలబడాలి. తరువాత పైకి ఎగురుతూ కాళ్లు ట్రయాంగిల్‌లో చేసి చేతుల్ని పైకి ఎత్తాలి. అలానే ఎగురుతూ కాళ్లు దగ్గరచేసి చేతుల్ని కిందికి తేవాలి.
జంఘ శక్తి (క్రియ1): ఈ వ్యాయామం చేయడం ద్వారా కాళ్లు, తొడలు, కోర్ మజిల్‌లో బలం పెరుగుతుంది. దీన్ని స్క్వాట్స్ ఎక్సర్‌సైజ్ చేసినట్టే చేయాలి. ముందు కాళ్లు దగ్గరగా పెట్టి మడమల్ని ఒకదానికొకటి ఆన్చాలి. చేతుల్ని తొంబై డిగ్రీల్లో ముందుకు చాపాలి. తరువాత కుర్చీలో కూర్చున్నట్టుగా గాలిలో కూర్చొని కొద్దిసేపు ఉండాలి.
నోట్: ఆసనాలైనా, వ్యాయామాలైనా ముందు యోగా ట్రైనర్ల దగ్గర ట్రైన్ అయిన తరువాతే సొంతంగా ప్రాక్టీస్ చేయాలి.