టెన్త్ – డిగ్రీ విద్యార్థులకు రూ.2500 స్టైపెండ్

టెన్త్ – డిగ్రీ విద్యార్థులకు రూ.2500 స్టైపెండ్

డిగ్రీలు, బీటెక్‌లు చదివినా కూడా దాదాపు 80 శాతం యువతలో పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన టెక్నికల్ స్కిల్స్ ఉండడం లేదంటూ అనేక సర్వేలు చెబుతున్నాయి. కాలేజీల్లో థియరీపై తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందన్నది ఆ రిపోర్టుల మాట. విద్యా సంస్థలు, విద్యార్థులు కూడా ఈ విషయం నిజమేనని ఒప్పుకొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి నుంచే విద్యార్థులకు ఇండస్ట్రీయల్ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. కొన్ని టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌కు విద్యార్థులను లింక్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఆదివారం నాడు గోరఖ్‌పూర్‌లో జరిగిన ఉద్యోగ మేళాలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆ ఇంటర్న్‌షిప్ నడిచినంత కాలం శిక్షణతో పాటు రూ.2500 స్టైపెండ్ ఇస్తామని చెప్పారు. ఇందులో రూ.1500 కేంద్రం భరిస్తుందని తెలిపారు. ప్రతి మండలంలో ఐటీఐ, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. యువతకు శిక్షణ పూర్తయ్యాక వారికి ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రభుత్వం సాయమందిస్తుందని హామీ ఇచ్చారు.