ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వనిదే.. ఎన్నికలకు వెళ్లం : సీఎం యోగి

ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వనిదే.. ఎన్నికలకు వెళ్లం : సీఎం యోగి

స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.  దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వేను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సర్వే, ఓబీసీ రిజర్వేషన్ల కేటాయింపు పూర్తయ్యే వరకు.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించబోమని యోగి తేల్చి చెప్పారు.  ఓబీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేది లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెంటనే నోటిఫికేషన్  ఇవ్వాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని యోగి అన్నారు. 

స్థానిక సంస్థల్లో ఓబీసీలకు దాదాపు 30 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ ను యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం డిసెంబరు 5న విడుదల చేసింది. అయితే ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఈ నోటిఫికేషన్ ను తోసిపుచ్చింది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇచ్చింది. ఈనేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.