గతంలో గూండాల చేతిలో పాలన

గతంలో గూండాల చేతిలో పాలన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో... ఉత్తరప్రదేశ్ అభివృద్ధి డబుల్ ఇంజిన్ తో దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అలీగఢ్‌లో   రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో రాష్ట్రంలో పాలనంతా గూండాల చేతిలో నడిచేదని, యోగి సీఎం అయ్యాక వాళ్లంతా ఇప్పుడు జైళ్లలో ఉన్నారని మోడీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లతో ఆయన పోరాడాల్సి వచ్చిందని, ఇప్పడు పెట్టుబడులకు మంచి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. పేదలు, అట్టడుగు వర్గాలకు కూడా అభివృద్ధి, సంక్షేమం చేరుతున్నాయని అన్నారు. ఈ కరోనా సమయంలోనూ ఎవరూ ఆకలితో పస్తులుండకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. యూపీలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందుతోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్ అయిపోందన్నారు.

యోగి పాలనలో రాష్ట్ర అభివృద్ధికి మంచి వాతావరణం ఏర్పడిందని మోడీ అన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు యూపీ ఒక ఆకర్షణగా మారుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అలీగఢ్ డిఫెన్స్ హబ్ గా మారుతోందన్నారు. గ్రెనేడ్లు, రైఫిల్స్, విమానాలు అన్నీ ఉత్తరప్రదేశ్ లోనే తయారవుతున్నారని చెప్పారు. గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్‌పోర్టర్‌‌గా భారత్ ఎదుగుతోందని మోడీ అన్నారు.