లవ్ జిహాద్‌‌ను ఆపేస్తారా?.. అంతిమ యాత్రకు సిద్ధమవుతారా?

లవ్ జిహాద్‌‌ను ఆపేస్తారా?.. అంతిమ యాత్రకు సిద్ధమవుతారా?

సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్
జౌన్‌‌పూర్: పెళ్లి కోసం మతమార్పిడి చేయడం ఆమోదయోగ్యం కాదని రీసెంట్‌‌గా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘లవ్ జిహాద్’ చేస్తున్న వారు తమ మార్గాలను పరిష్కరించుకోవాలని లేదా అంతిమ యాత్రకు సిద్ధంగా ఉండాలని యోగి హెచ్చరించారు. జౌన్‌‌పూర్‌‌లో నిర్వహించిన బైపోల్స్ క్యాంపెయినింగ్‌‌లో పాల్గొన్న యోగి.. పెళ్లి కోసమే మత మార్పిడి ఆమోదయోగ్యం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

‘పెళ్లి కోసం మతమార్పిడులు జరగొద్దు. ఒకవేళ అలాంటివి జరిగినా వాటిని ఆమోదించొద్దు, గుర్తించొద్దు. ప్రభుత్వం కూడా లవ్ జిహాద్‌‌కు ఎండ్ కార్డ్ వేసే దిశగా పలు కీలక నిర్ణయాలపై సమాలోచనలు చేస్తోంది. దొంగచాటుగా, పేర్లు దాచి పెట్టి కొందరు మన అక్కాచెళ్లెళ్లతో ఆడుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ఒక విషయం స్పష్టం చేస్తున్నా.. వాళ్లు మారితే సరే లేకపోతే రామ్ నామ్ సత్య హే అనుకుంటూ తమ జీవితపు అంతిమ యాత్రకు సన్నద్ధమవ్వాల్సిందే. మేం ఇప్పటికే మిషన్ శక్తి ప్రోగ్రామ్‌‌ను మొదలుపెట్టాం. దీని ద్వారా మన అక్కాచెళ్లెళ్లకు రక్షణ కల్పిస్తున్నాం. ఎవరైనా తప్పుడు చర్యలకు పాల్పడితే వాళ్లకు తగిన బుద్ధి చెప్పడానికి మిషన్ శక్తి రెడీగా ఉంటుంది. మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు అక్కాచెళ్లెళ్లను గౌరవించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం’ అని యోగి పేర్కొన్నారు.