రాష్ట్రపతి నిలయానికి.. ఏ రోజైనా వెళ్లొచ్చు

రాష్ట్రపతి నిలయానికి.. ఏ రోజైనా వెళ్లొచ్చు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రెసిడెంట్ శీతాకాల విడిది తర్వాత 15 రోజులు సందర్శకుల కోసం తెరిచి ఉంచేవారు. 162 ఏండ్ల చరిత్ర ఉన్న రాష్ట్రపతి నిలయంలోని చారిత్రక కట్టడాలు, పూల, పండ్ల తోటలు ఎంతో ఆకట్టుకునేవి. ఏడాదికి ఒకసారి మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంచేటోళ్లు. కానీ, ఇకపై ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయం సందర్శకులకు అందుబాటులో రానున్నది. 23న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి వర్చువల్​ మోడ్​లో రాష్ట్రపతి నిలయాన్ని ప్రారంభిస్తారు. దీనికి గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి నిలయం నుంచి అటెండ్ అవుతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం రాష్ట్రపతి అడిషనల్ సెక్రటరీ రాకేశ్ గుప్తా అధ్యక్షతన పలువురు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడారు. రాష్ట్రపతి నిలయం ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఓపెన్ ఉంటుందన్నారు. సందర్శకుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్కరు రూ.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. విదేశీయులు అయితే రూ.250 పే చేయాలని తెలిపారు. 14వ తేదీ నుంచి రాష్ట్రపతి నిలయం అధికారిక వెబ్​సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.