
- వ్యాలెట్ నుంచి డబ్బు తీయొచ్చు
- ఏటీఎం ద్వారా వ్యాలెట్ డబ్బును తీసుకోవచ్చు
- ఇందుకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్న పీపీఐలు
న్యూఢిల్లీ: ఇక నుంచి మొబైల్ వ్యాలెట్స్ వంటి ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్‌స్ట్రమెంట్స్ (పీపీఐలు) నుంచి డబ్బు తీసుకునేందుకు, పంపేందుకు అనుమతించాలని ఆర్‌బీఐ మానిటరీ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో డబ్బు పంపేందుకు ఆర్‌బీఐ రూపొందించిన ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లో వ్యాలెట్లను కూడా చేర్చుతామని ప్రకటించింది. దీనివల్ల ఇక నుంచి వ్యాలెట్స్ బ్యాంకు ఖాతాలకు సమానమవుతాయి. ఖాతా నంబరు మాత్రం ఉండదు. వ్యాలెట్స్ కంపెనీలకు ఏటీఎంలు కూడా ఉండవు. యూజర్ ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వ్యాలెట్స్ కంపెనీలు యూజర్లకు ప్రీపెయిడ్ కార్డులు ఇస్తాయి. వ్యాలెట్స్ నుంచి యూపీఐ విధానం ద్వారా డబ్బు పంపుకునేందుకు ఆర్బీఐ 2018లోనే గైడ్‌లైన్స్ ఇచ్చింది. రూపే, వీసా నెట్‌వర్క్స్ ద్వారా ప్రీపెయిడ్‌కార్డులు ఇవ్వాలని కంపెనీలకు సూచించింది. ఇప్పటి వరకు కార్డులు తీసుకోవడం తప్పనిసరి కాదు. అందుకే వీటిని తక్కువ మంది మాత్రమే తీసుకున్నారు. ఇక నుంచి వ్యాలెట్స్ నుంచి యూపీఐ ద్వారా డబ్బులు పంపేందుకు అనుమతులు ఇవ్వడం, కార్డులు జారీ చేయడం తప్పనిసరని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
మూడుదశల్లో కంప్లీట్
ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం వ్యాలెట్స్ ఇంటర్‌ఆపరేటబిలిటీ మూడుదశల్లో జరుగుతుంది. మొదట వ్యాలెట్స్ యూపీఐ నెట్‌వర్క్‌లో చేరతాయి. ఫలితంగా వ్యాలెట్స్ నుంచి యూపీఐ విధానంలో బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించుకోవచ్చు. ఇది రెండోదశ. పీపీఐలు కార్డులు ఇవ్వడం ద్వారా మూడోదశ పూర్తవుతుంది. కేవైసీ డాక్యుమెంట్లు ఇచ్చిన వ్యాలెట్స్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఇక నుంచి పేటీఎం యూజర్ తన వ్యాలెట్ నుంచి అమెజాన్ లేదా ఫోన్‌పే వ్యాలెట్‌కు డబ్బు పంపించవచ్చు. బ్యాంకు ఖాతాకూ పంపవచ్చు. ఇప్పుడైతే పేటీఎం నుంచి పేటీఎం వ్యాలెట్‌కు మాత్రమే డబ్బు పంపేందుకు వీలుంది. అమెజాన్ వంటి వ్యాలెట్లు అయితే ఇతర అమెజాన్ వ్యాలెట్లకు కూడా డబ్బు పంపేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం వ్యాలెట్ల నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని ఉపయోగించడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలా మంది యూజర్లు తమ ఆధార్ వివరాలను ఇవ్వలేదు. ఇదిలా ఉంటే పూర్తిస్థాయి కేవైసీ చేయించుకున్న ఖాతాదారులు ఇక నుంచి తమ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు బదులు రూ.రెండు లక్షల వరకు ఉంచుకునేందుకు అనుమతివ్వాలని ఆర్‌బీఐ ప్రపోజ్ చేసింది. ఈ విషయమై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని సంస్థ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.