
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అద్భుతమైన ప్రాజెక్టు అంటారు.. కానీ ప్రతిపక్షాలు చూడ్డానికి మాత్రం వెళ్లనివ్వరని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే రాష్ట్రం వచ్చిందన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.. రూ.18 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నారు.. కానీ డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ మాత్రం కట్టలేదని ఆరోపించారు. దీనికి మంత్రి హరీష్ రావు స్పందిస్తూ... మీరు కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తామంటే తమ అధికారులే తీసుకెళ్లి చూపిస్తారని, అవసరమైతే భోజనం పెట్టిస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్లు వెళ్తామన్నపుడు వరదలొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతమంతా బురదమయమైందని ... కావాలంటే ఇప్పుడు వెళ్లి డౌట్స్ క్లియర్ చేసుకోండని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల మరమ్మతులు జరుగుతున్నాయని, అక్కడికి వెళ్తే భట్టి గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో.. లేదంటే బురదలో జారిపడతారేమోనని అలా చెప్పినట్టు మంత్రి క్లారిటీ ఇచ్చారు.
కట్టేసి కొట్టినట్లు ఉందని, తన మైకు కట్ చేసి మంత్రికి ఇచ్చారని ఆ తర్వాత భట్టి విక్రమార్క ఆరోపించారు. మిమ్మల్ని కట్టేసి ఎవరు కొట్టనవసరం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్ రావు బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల వద్ద వరద నీటితో పంటపొలాలు నీట మునుగుతున్నాయన్న భట్టి.. ఆ రైతులను ఆదుకోండని డిమాండ్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కూడా పూర్తి చేయండని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ఎందుకు కడ్తలేరని ప్రశ్నించిన ఆయన.. కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులు కట్టామని తేల్చి చెప్పారు.