న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ ఇష్యూ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కుమ్మక్కై ఓట్ చోరీకి పాల్పడుతోన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రశాంతంగా రిటైర్ కాలేరని హెచ్చరించారు. ప్రశాంతంగా రిటైర్మెంట్ అవుతానని ఆయన అనుకుంటే అది పొరపాటేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్తో పాటు మిగిలిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషికి కూడా ఇదే వర్తిస్తుందన్నారు. జ్ఞానేష్ కుమార్, సంధు, వివేక్ జోషిని ఎప్పటికీ మర్చిపోవద్దని.. వీరి పేర్లను గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (నవంబర్ 7) రేగాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఈసీ కలిసి పెద్ద ఎత్తున ఓట్ చోరీకి పాల్పడ్డాయని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బీజేపీ, ఈసీ కుట్రలను బహిర్గతం చేశాడన్నారు. ప్రజలు తమను మోసం చేసే వారిని ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషితో సహా ఓట్ చోరీలో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా రిటైర్ కాలేరని మరోసారి హెచ్చరించారు. ఓట్ చోరీకి పాల్పడిన వీళ్లు శాంతియుతంగా పదవీ విరమణ చేయాలని ఆశించకూడదని పేర్కొన్నారు.
