వాషింగ్టన్: చైనాపై అదనపు చర్యలను తీసుకోవడానికి యునైడెట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిద్ధం అవుతోంది. అయితే వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి మాత్రం వైట్ హౌజ్ నిరాకరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి బీజింగ్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభం అయింది. చైనా నుంచే కరోనా వచ్చిందని, వరల్డ్ వైడ్‌గా వైరస్ వ్యాప్తికి డ్రాగనే నిర్లక్ష్యమే కారణమని ట్రంప్ అనేకమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అలాగే హాంకాంగ్‌పై చైనా కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని రుద్దడంతో రెండు దేశాల మధ్య పొరపచ్చాలు తీవ్రతరం అయ్యాయి. దీంతో చైనాపై పలు కఠిన చర్యలు తీసుకోవడానికి వైట్ హౌజ్ ప్రిపేర్ అవుతోంది.
‘చైనాపై తీసుకోబోయే చర్యల గురించి మా ప్రెసిడెంట్ కంటే ముందు నేను చెప్పలేను. కానీ ఆ దేశంపై రాబోయే రోజుల్లో మేం కొన్ని చర్యలు తీసుకుంటామనేది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి దాన్ని మాత్రం నేను ధృవీకరిస్తా’ అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కైలీ మైక్ ఎనానీ చెప్పారు. ‘రాబోయే రోజుల్లో చైనాకు సంబంధించి మీరు గణనీయమైన చర్యలను చూడబోతున్నారని అనుకుంటున్నా. ప్రెసిడెంట్ ట్రంప్ మాదిరిగా చైనాకు అండగా నిలిచిన మరో అధ్యక్షుడు లేరు. వాణిజ్య అసమతుల్యత (ట్రేడ్ ఇంబ్యాలెన్స్)ను అరికట్టడానికి చైనాపై ట్రంప్ భారీ సుంకాలు విధించారు’ అని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. యూజర్ల పర్సనల్, ప్రైవేట్ డేటాను కాజేస్తున్నాయని భావిస్తున్న టిక్‌టాక్, వీచాట్ లాంటి యాప్స్‌ను తాము నిశితంగా గమనిస్తున్నామని ఓబ్రెయిన్ వివరించారు.
