తాష్కెంట్: ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో 27 పతకాలను ఖాయం చేసుకున్నారు. అండర్-15 బాలికల విభాగంలో 15 పతకాలకు14 పతకాలు, బాలుర విభాగంలో 15 పతకాలకు 13 పతకాలు భారత్ సొంతమయ్యాయి. బాలుర విభాగంలో భారత బాక్సర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
పలువురు బాక్సర్లు 'రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్' పద్ధతిలో విజయం సాధించారు. 37 కేజీల విభాగంలో శాస్త వసంత్ అశోక్ కుమార్, 49 కేజీల విభాగంలో పర్షాంత్ తొలి రౌండ్‌లోనే ప్రత్యర్థులపై గెలుపొందారు. 40 కేజీల నితిన్, 55 కేజీల హర్షవర్ధన్ జీనా రెండో రౌండ్‌లో ఆర్ఎస్సీ విజయాన్ని అందుకున్నారు.
ఉత్కంఠభరితంగా సాగిన మరికొన్ని పోరుల్లో 33 కేజీల యశ్ కుమార్, 35 కేజీల రోహిత్ పోతిన 4:1 తేడాతో స్ప్లిట్ నిర్ణయం ద్వారా విజయం సాధించారు. మరోవైపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లలో 43 కేజీల సమీర్ బోరా, 46 కేజీల నాంగ్ పోక్న్‌గాంబా మైతీ ఒయినం, 58 కేజీల మహ్మద్ యాసర్ ప్రత్యర్థులపై విజయం సాధించారు.
