కొంగరకలాన్​లో అతి త్వరలో ఫాక్స్​కాన్ యూనిట్

కొంగరకలాన్​లో అతి త్వరలో ఫాక్స్​కాన్ యూనిట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫాక్స్​కాన్​ కార్యకలాపాలపై సందిగ్ధతకు ఆ సంస్థ తెరదించింది. కొంగర కలాన్​లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపిస్తామని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ఈ నెల 2న రాష్ట్రానికి వచ్చిన యంగ్​ ల్యూ తన టీంతో కలిసి ప్రగతిభవన్​లో కేసీఆర్​తో భేటీ అయ్యారు. అదే రోజు సాయంత్రం మంత్రి కేటీఆర్​తో కలిసి టీ వర్క్స్​ను ప్రారంభించారు. ఆ మరుసటి రోజు ఆయన బెంగళూరులో పర్యటించడంతో తెలంగాణలో ఆ సంస్థ ఉంటుందా.. కర్నాటకకు వెళ్లిపోతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. వాటికి ముగింపు పలుకుతూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా కొంగర కలాన్ లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని యంగ్ ల్యూ పేర్కొన్నారు.

హైదరాబాద్ లో తమకు ఆత్మీయ ఆతిథ్యం లభించిందని, తమ హైదరాబాద్ బస చాలా అద్భుతంగా జరిగిందన్నారు. తన బర్త్ డే సందర్భంగా ప్రత్యేక గ్రీటింగ్ కార్డ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పినందుకు కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్​ విజన్ అద్భుతమని, తమతో కలిసి పని చేయడానికి కొత్త స్నేహితుడు లభించాడని  కొనియాడారు. తన అతిథిగా తైవాన్ కు రావాలని కేసీఆర్ ను యంగ్ ల్యూ ఆహ్వానించారు.