కరీంనగర్ జిల్లాలో విషాదం: స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో విషాదం: స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

స్మార్ట్‌ఫోన్ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోన్ కొనివ్వలేదన్న చిన్న మనస్థాపంతో ఓ వలస కూలీ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.బీహార్ కు  చెందిన నితీష్ కుమార్ అనే యువకుడు.. పది రోజుల క్రితమే కామారెడ్డిలో ఉంటున్న తన అన్న వద్దకు వచ్చాడు. తనకు ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కావాలని అన్నయ్యను కోరాడు. అయితే ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని, త్వరలోనే కొనిస్తానని అన్నయ్య నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలోనే నితీష్‌ను తిరిగి బీహార్ పంపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని హరిప్రియ రైస్ మిల్లులో పనిచేస్తున్న మరో అన్న వద్దకు నితీష్‌ను పంపించారు. అక్కడి నుండి అతడిని స్వగ్రామానికి పంపించాలనేది కుటుంబ సభ్యుల ప్లాన్.అయితే అన్నయ్య స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదనే  మనస్థాపంతో చొప్పదండిలో నితీష్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తమ్ముడు.. ఫోన్ కోసం ఇలా ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు