కందుకూరు మండలంలో బెట్టింగ్కు మరో యువకుడు బలి..లక్ష పోగొట్టుకుని సూసైడ్

కందుకూరు మండలంలో  బెట్టింగ్కు మరో యువకుడు బలి..లక్ష పోగొట్టుకుని సూసైడ్

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆన్‌‌‌‌ లైన్ బెట్టింగ్ లో లక్ష రూపాయలను పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురైన స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన వాస్పూరి విక్రమ్ (20) నారాయణగూడలోని బీజేఆర్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఇంటి నుంచి సుమారు లక్ష రూపాయలను తీసుకుని ఫన్ ఇన్ ఎక్స్ఛేంజ్‌‌‌‌ అనే  ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి ఆ మొత్తం డబ్బులను కోల్పోయాడు. 

డబ్బుల గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తారనే భయంతో మంగళవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే అక్కడ చేర్చగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ  విక్రమ్ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.