
- మృతురాలిది ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక
- యువకుడి వేధింపులే కారణమని తండ్రి ఆరోపణ
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఎల్బీనగర్/ములుగు, వెలుగు : హైదరాబాద్‌లోని ఓ హాస్టల్లో ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఆరోపించాడు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బాధితుల కథనం ప్రకారం..ములుగు జిల్లా వెంకటాపూరం మం డలం ఆలుబాకకు చెందిన సుంకర వెంకట సుబ్బారావు కూతురు సాహితి(26) ఎంబీఏ పూర్తి చేసింది. రెండు నెలల క్రితం హైదరాబాద్ దిల్ సుఖ్‌నగర్‌లోని లక్ష్మి హాస్టల్లో ఉంటూ పైథాన్ కోర్సు నేర్చుకుంటోంది.
బుధవారం రూంలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. హాస్టల్ లో ఉండే మిగతా స్టూడెంట్స్ గుర్తించి నిర్వాహకులకు చెప్పగా చైతన్యపురి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సాహితి కుటుంబసభ్యులకు తెలిపారు.
యువకుడి వేధింపులతోనే..
తన కూతురు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన కాంగ్రెస్ లీడర్ కొడుకు వేధించడంతోనే చనిపోయిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటపడడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. మరోవైపు సాహితి మరణానికి కారకుడిని శిక్షించాలని ఆలుబాక గ్రామస్తులు వెంకటాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గురువారం రాత్రి సాహితి మృతదేహం వెంకటాపురం చేరుకోగానే నిందితుడిని శిక్షించాలని నినాదాలు చేశారు. తర్వాత 45 నిమిషాల పాటు ప్రధాన వాడల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.