అనుమతులు లేకుండా వ్యవసాయ డిగ్రీలా? : హరిప్రసాద్

అనుమతులు లేకుండా వ్యవసాయ డిగ్రీలా? : హరిప్రసాద్
  • ఆ ఐదు ప్రైవేట్ వర్సిటీలపై చర్యలు తీసుకోండి
  • ఐసీఏఆర్​కు యూత్ కాంగ్రెస్ నేతరూపావత్ హరిప్రసాద్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో ఐసీఏఆర్ (భారత వ్యవసాయ పరిశోధన మండలి), రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యవసాయ డిగ్రీలను అందిస్తున్న ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలపై చర్యలు తీసుకోవాలని ఐసీఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపావత్ హరిప్రసాద్  ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీలోని పూసాలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. మంగీలాల్ జాట్‌‌‌‌‌‌‌‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. కావేరి, మల్లా రెడ్డి, అనురాగ్, ఎస్సార్, గురునానక్ విశ్వవిద్యాలయాలు ఐసీఏఆర్ గుర్తింపు లేకుండా బీఎస్సీ (ఏజీ), ఎంఎస్సీ (ఏజీ), పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ (ఏజీ) కోర్సులను నిర్వహిస్తున్నాయని హరిప్రసాద్ ఆరోపించారు.

ఈ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ విద్యా నాణ్యత ప్రమాణాలను అనుసరించకుండా, తప్పుడు ప్రచారాలతో ఐసీఏఆర్ గుర్తింపు ఉన్నట్లు విద్యార్థులను మోసగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా కావేరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గత పదవిని దుర్వినియోగం చేస్తూ, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల పేర్లను ఉపయోగించి నకిలీ గుర్తింపును ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వర్సిటీలు ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల విధానంలో అసమానతలు, మౌలిక సదుపాయాల లోపాలు విద్యా నాణ్యతపై సందేహాలను కలిగిస్తున్నాయని హరిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విశ్వవిద్యాలయాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఐసీఏఆర్‌‌‌‌‌‌‌‌ను కోరారు.