హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు, క్యాడర్‌కు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సూచించారు. ఈ మేరకు బుధివారం గాంధీ భవన్‌లో కొత్త ఓట్ల నమోదు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం శవచరణ్రెడ్డి మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున కొత్త ఓటర్లను చేర్పించాలని కోరారు. ఓటు హక్కు వయస్సును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించి యువతను దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని కితాబిచ్చారు. ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కొత్త ఓటర్లను చేర్పించే కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని కోరారు.
