హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో తండ్రి మృతికి వైద్య సిబ్బంది కారణమని యువకుడు హల్ చల్

హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో తండ్రి మృతికి వైద్య సిబ్బంది కారణమని  యువకుడు హల్ చల్
  • ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఫర్నిచర్ ధ్వంసం
  • హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన  

హుస్నాబాద్, వెలుగు:  తండ్రి మృతిపై ఆగ్రహం చెందిన యువకుడు హల్ చల్ చేసిన ఘటన హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లికి చెందిన దొంతరబోయిన విజయ్ కు గురువారం రాత్రి గుండెపోటు రాగా.. కుటుంబసభ్యులు108లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

డాక్టర్లు పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో మృతుడి కొడుకు ధనుశ్  ఆగ్రహం చెందాడు. ఆస్పత్రి సిబ్బంది సమయానికి ఆక్సిజన్ అందించకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడని ఆరోపించాడు. మెడిసిన్ పడేసి.. ఫర్నిచర్, రిసెప్షన్ కౌంటర్ ను ధ్వంసం చేశాడు. 

ఆపై ఆస్పత్రిని తగలబెడతానని బెదిరింపులకు దిగాడు. డ్యూటీలోని మహిళా సిబ్బందిని బూతులు తిడుతూ హల్ చల్ చేశాడు. పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా వినలేదు. ఘటనతో డాక్టర్లు, వైద్య సిబ్బంది భయాందోళన చెందారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఫిర్యాదుతో ధనుశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.