లోన్ ​యాప్​ వేధింపులతో యువకుడు మిస్సింగ్

లోన్ ​యాప్​ వేధింపులతో యువకుడు మిస్సింగ్

ఎల్బీనగర్, వెలుగు : లోన్ యాప్ వేధింపుల కారణంగా ఓ బీటెక్ స్టూడెంట్ కనిపించకుండాపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ ఎల్ఐసీ కాలనీకి చెందిన గాధం సాయికిరణ్(24) బీటెక్ చదవుతున్నాడు. ఇతనికి మూడేండ్ల వయస్సున్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. బాబాయ్ కర్ణ, పిన్ని అరుణ సాయికిరణ్ ను పెంచారు. సాయికిరణ్​ప్రస్తుతం టీకేఆర్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదుతున్నాడు.

అయితే గత నెల 24 నుంచి కనిపించకుండా పోవడంతో కర్ణ, అరుణ హయత్ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కొన్నిరోజులుగా సాయికిరణ్ స్నేహితుల ఫోన్లకు అపరిచిత వ్యక్తుల నుంచి -మెసేజ్​లు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ తమ యాప్​లో లోన్ తీసుకున్నాడని, వెంటనే క్లియర్​చేయాలని బెదిరిస్తున్నట్లు తెలుసుకున్నారు.

పైసలు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి, ఫోన్​నంబర్లతో సహా పోర్న్​వెబ్​సైట్లలో అప్లోడ్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు గుర్తించారు. లోన్ రికవరీ ఏజెంట్లు సాయికిరణ్​ను వేధించడంతో ఇల్లు విడిచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.