
ఇతర రంగాల సంగతేమోగానీ, పాలిటిక్స్‌లో మాత్రం ఎప్పుడూ యూత్ వర్సెస్ సీనియర్స్ తగాదా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం ఉంటారు? మాకు అవకాశాలు రావద్దా అని యూత్ సణుగుతూ ఉంటుంది. అయితే, సోషల్ సైంటిస్టులు మాత్రం సీనియర్ల వైపే నిలుస్తున్నారు. పరిపక్వత అనేది పాలిటిక్స్‌కి చాలా అవసరం. సోషల్ కన్సర్న్ విషయంలో యూత్‌కి అంతగా పట్టింపు లేదని కొట్టిపారేస్తున్నారు. పాలిటిక్స్‌కి కావలసిన కలుపుగోలుతనం, చకచకా పావులు కదిపే చాణక్యం సీనియర్లలోనే ఉంటుందని సమర్థిస్తున్నారు.
దేశానికి యువశక్తి ఎంత అవసరమో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కూడా అంతే అవసరం అంటున్నారు లీడర్లు. 70 ఏళ్లు దాటిన వాళ్లు రాజకీయంగా రిటైర్ కావాలన్న డిమాండ్ లేటెస్ట్గా తెర మీదకు వచ్చిన పరిస్థితుల్లో వయసుకు, రాజకీయాల్లో కొనసాగడానికి సంబంధం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. నేషనల్ పాలిటిక్స్ పరిశీలిస్తే ఇప్పటికీ అనేక పార్టీలకు నాయకత్వం వహిస్తున్నవారిలో 70 ఏళ్లకు పైబడ్డవారే కనిపిస్తుంటారు. సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ (80), జేడీ (ఎస్) నేత హెచ్.డీ.దేవెగౌడ (86), శిరోమణి అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ (91) వంటి లీడర్లు ఇప్పటికీ రాజకీయంగా యాక్టివ్గానే ఉన్నారు. ఆ వయసులో కూడా పొలిటికల్ స్ట్రేటజిస్టులుగా మంచి చురుగ్గా ఉంటున్నారు. యువతరం నేతలతో పోటీ పడుతూ వాళ్ల వాళ్ల పార్టీలను ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలం యువ నాయకత్వం వల్లనే దేశ రాజకీయాలు బాగుపడతాయన్న అభిప్రాయం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు సోషల్ సైంటిస్టులు.
యూత్ ముసుగులో వారసత్వ పాలిటిక్స్
వయసు మీద పడ్డ వాళ్లను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించాలన్న వాదనలో వారసత్వ పాలిటిక్స్‌ని ప్రోత్సహించే కనిపించని కుట్ర కూడా ఉందన్న మరో వాదన వినిపిస్తోంది. అనేక ప్రాంతీయ పార్టీల పరిస్థితులను సోషల్ సైంటిస్టులు ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ యాదవ్ స్థానంలో ఆయన కొడుకు తేజస్వీ యాదవ్, ములాయం స్థానంలో ఆయన కొడుకు అఖిలేశ్ యాదవ్, కరుణానిధి స్థానంలో ఆయన కొడుకు స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. యువత ముసుగులో రాజకీయ పార్టీల్లో తండ్రి వృద్ధుడైతే ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి పుత్రరత్నాలు పోటీ పడుతున్నారు.
సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా వంటి లీడర్లకు రాజకీయాల్లో ప్రవేశించడానికి ఉన్న ఏకైక అర్హత వారసత్వ పాలిటిక్సేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సగటు యువత కంటే సింధియాలు, పైలెట్లు, దేవరాలు ఎందులో ఎక్కువ? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పార్టీల్లో వాళ్లకంటే ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నప్పటికీ సీనియర్ లీడర్ల పిల్లలు కావడం వల్లే… యువత పేరుతో సునాయాసంగా రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్లగలిగారన్నది రాజకీయ పండితుల వాదన. రాజకీయ నాయకుడి వయసు తక్కువా లేక ఎక్కువా అనేది ఎవరూ పట్టించుకోరన్నారు. సమాజానికి కావాల్సింది సరికొత్త ఆలోచనలు చేసే నాయకులేనన్నారు.
రిటైర్మెంట్ ఏజ్ ఉండాలా?
ప్రభుత్వ ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉన్నట్లు రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ ఉండాలన్న వాదన కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ఈ వాదనకు అనుకూలంగా కొంతమంది మాట్లాడుతుంటే మరికొంతమంది వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వయసు మీద పడ్డ రాజకీయ నాయకులు స్వచ్చందంగా తప్పుకుని యువతకు దారి ఇవ్వాల్సిన టైం వచ్చిందంటారు బీజేపీ ప్రతినిధి షాజియా ఇల్మి. ఈ వాదనను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తప్పు పడుతున్నారు.రాజకీయాల్లో ఉండాలంటే ఏజ్ ఫిక్స్ చేయాలన్న వాదన కరెక్ట్ కాదన్నారు. యువతరం తో పాటు అనుభవంతో తలపండిన పెద్దలు కూడా రాజకీయ పార్టీలకు అవసరమేనన్నారు. రాజకీయాలంటే పాత, కొత్తల మేలు కలయిక లాగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలన్న స్వేచ్ఛ ప్రజలకు తప్పనిసరిగా ఉండాలన్నారు కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా. ప్రజలు ఫలానా లీడర్ తమకు పనికొస్తాడా? లేడా ? అని మాత్రమే చూస్తారన్నారు. నాయకుడి వయసెంత అనే విషయాన్ని పట్టించుకోరని తెగేసి చెప్పారు. ఫలానా వయసుకు రాగానే పొలిటికల్ లీడర్లు తప్పుకోవాలంటూ రూల్ పెట్టడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. అయితే ఎప్పుడు పాలిటిక్స్ నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలో నాయకులే తమంతట తామే డిసైడ్ చేసుకోవాలన్నారు.
వయసు కొలమానం కారాదు
ప్రభుత్వ ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉన్నట్లు, రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ ఉండాలన్న వాదనను ఎనలిస్టులు తోసిపుచ్చారు.
బీజేపీ ఫాలో అవుతున్న రూలు ఏంటంటే …
సీనియర్లకు సంబంధించి బీజేపీ కొన్నేళ్లుగా ఒక విధానాన్ని అనుసరిస్తోంది. 75 ఏళ్లు పైబడ్డ వాళ్లను కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడా మంత్రి పదవుల్లోకి తీసుకోవడం లేదు. అలాగే 70 ఏళ్లు దాటిన వారికి లేటెస్ట్ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వలేదు. ఇక్కడ వయసునే బీజేపీ కొలమానంగా తీసుకుంది. ఈ రూల్కి అనుగుణంగా సీనియర్ లీడర్లు మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ, బండారు దత్తాత్రేయ వంటి వారికి పార్టీ టికెట్లు ఇవ్వలేదు. ఈ రూల్ ఒక దశలో వివాదానికి దారితీసినప్పటికీ, బీజేపీ పెద్దలు ఎక్కడా మెత్తపడలేదు.
పెద్దోళ్లయినా ఓకే
వయసు ముదిరితే ఆలోచనలు పనికి రాకుండా పోతాయా! ఫ్రెష్ ఐడియాలకు, వయసుకు ఏమాత్రం సంబంధం లేదు. రాజకీయాల్లో యువత పాత్ర తప్పకుండా పెరగాలి. అంతమాత్రాన వయసు మీరిన వాళ్లు రాజకీయాలకు పనికిరారన్న వాదన కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొనసాగేవారికి, పార్టీలకు నాయకత్వం వహించేవారికి ఉండాల్సింది సమాజం పట్ల కన్సర్న్. చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పటికీ తాజా ఆలోచనలతోనే ఉంటారు. అలా ఉండబట్టే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.‑ యోగేంద్ర యాదవ్, స్వరాజ్ అభియాన్ ఫౌండర్
జూనియర్లకు చాన్స్ ఎప్పుడు?
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ రిటైర్ కావాల్సిందే. వయసు మీద పడ్డ రాజకీయ నాయకులు స్వచ్చందంగా తప్పుకుని యువతకు దారి ఇవ్వాల్సిన టైం వచ్చింది. సీనియర్ పొలిటీషియన్లే ఎల్లకాలం కంటిన్యూ అవుతుంటే… జూనియర్లకు అవకాశాలు వచ్చేదెప్పుడు? వాళ్లు నేర్చుకునేదెప్పుడు? ‑ షాజియా ఇల్మి,బీజేపీ ప్రతినిధి