
హర్యానా: పాకిస్తాన్కు స్పై ఏజెంట్గా పనిచేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆమెకు ఉగ్ర కార్యకలాపాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ప్రకటించారు. ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో కమ్యునికేట్ అయిందని అయితే ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. మల్హోత్రాకు సాయుధ దళాల గురించి, వారి ప్లాన్స్ గురించి ఎటువంటి అవగాహన లేదని హిసార్ ఎస్పీ చెప్పారు. ఆమె తన మతం మార్చుకోవాలని భావించినట్టు గానీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు గానీ ఎలాంటి డాక్యుమెంట్స్ లభించలేదని వివరించారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. జ్యోతి మల్హోత్రా దగ్గర తమకు ఎలాంటి డైరీ దొరకలేదని.. ఆమె డైరీలోని పేజీలంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. తమ దగ్గర ఎలాంటి డైరీ లేదని హిసార్ ఎస్పీ చెప్పారు. మల్హోత్రా దగ్గర ఉన్న మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆమె వీసా ఏజెంట్ దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లను అనాలసిస్ కోసం ల్యాబొరేటరీకి పంపారని అయితే ఆ అనాలసిస్ బాధ్యతను తమకు అప్పగించలేదని హిసార్ పోలీసులు తెలిపారు.
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ చానెల్ నడుపుతున్న జ్యోతి.. కమీషన్ ఏజెంట్ల సాయంతో వీసా పొంది 2023లో పాకిస్తాన్లో పర్యటించింది. తన పర్యటనలో ఎషానుర్ రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుని సంబంధాలు పెంచుకుంది. డానిష్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో స్టాఫ్ మెంబర్గా పనిచేస్తున్నాడు.
Also Read : గవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతోంది
జ్యోతిని డానిష్ పలువురు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(పీఐఓ)కు పరిచయం చేశాడు. వాట్సాప్, టెలిగ్రాం, స్నాప్ చాట్ వంటి ప్లాట్ ఫాంలలో జ్యోతి వారితో టచ్లో ఉంటూ మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని షేర్ చేసింది. అలాగే పాక్ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్గా ప్రచారం చేసింది. ఓ పీఐఓతో జ్యోతి సన్నిహిత సంబంధం కూడా ఏర్పరుచుకుంది. అతడితో కలిసి బాలిలో పర్యటించింది. హిస్సార్లో జ్యోతిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు.