
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల గొంతు నొక్కాలని చూస్తున్నది. ఇది ఫెడరలిజంపై జరుగుతున్న దారుణమైన దాడి. దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో బుధవారం పోస్టు పెట్టారు.
భారతదేశం రాష్ట్రాల కలయిక అని, భారత్ బలం అందులోనే దాగుందని పేర్కొన్నారు. కాగా, రాహుల్ తన పోస్టుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పోస్టును ట్యాగ్ చేశారు. బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు కాలపరిమితి విధించగా.. దానిపై న్యాయసలహా కోరుతూ సుప్రీంకోర్టుకు ఇటీవల రాష్ట్రపతి లేఖ రాశారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. ఇది న్యాయ వ్యవస్థను సవాల్ చేయడమేనని పోస్టు పెట్టారు.